Begin typing your search above and press return to search.

ఏపీ నేత‌లు... మీకు ఇక‌ ఆ అహం ప‌నిచేయ‌దు...?

గత ఎన్నికలను గమనిస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు భిన్నమైన శైలిలో వ్యవహరించారు.

By:  Garuda Media   |   1 April 2026 1:00 PM IST
ఏపీ నేత‌లు... మీకు ఇక‌ ఆ అహం ప‌నిచేయ‌దు...?
X

గత ఎన్నికలను గమనిస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు భిన్నమైన శైలిలో వ్యవహరించారు. `మీరు మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు` అంటూ కొన్ని కొన్ని మండలాలు, గ్రామాల్లో.. నాయకులు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అంటే తమ గ్రామాలను పట్టించుకోవడంలేదని, తమ మండలాలను అభివృద్ధి చేయలేదని ఆవేదన ప్రజల్లో సహజంగా ఉంటుంది . అదేవిధంగా సుదీర్ఘకాలంగా పోరాడుతున్నప్పటికీ రోడ్లు వేయలేదన్న ఆవేదన కూడా పలు గ్రామీణ ప్రాంతాల్లో కనిపించింది, ఇక పట్టణాల్లోనూ అదే కనిపించింది, దీంతో నాయకులు చాలామంది గత ఎన్నికల సమయంలో ప్ర‌శ్నించిన వారికి.. `మీరు మాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు` అని వ్యాఖ్యానించారు.

ఉదాహరణకు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అప్పటి మంత్రి నారాయణస్వామి ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ తమకు అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు రాయడం లేదని.. అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందడం లేదని కొంతమంది ప్రశ్నించారు. అయితే దానికైనా సమాధానం చెప్పకపోగా.. `మీరు మాకు ఓటేశారా` అంటూ ప్రశ్నించారు. ఇది తీవ్ర వివాదం అయింది. అంతేకాదు.. మీరు మాకు ఓటేయక్కర్లేదు అని కూడా అప్పట్లో నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఈయ‌న ఒక్కడే కాదు అనంతపురంలో కూడా అలాగే జరిగింది.

అప్పటి అనంతపురం ఎంపీగా ఉన్న నాయకుడు ఓ మండలానికి వెళ్తే మండలంలో రోడ్లు సరిగా లేవని చెప్పినప్పుడు.. నీకు ఇస్తున్న అమ్మఒడి నిధులకే బడ్జెట్ సరిపోవటం లేదని, ఇంక రోడ్లు ఎక్కడ వేస్తామని విసురుగా మాట్లాడారు. కావాలనుకుంటే అమ్మ ఒడి డబ్బులు వదులుకోండి రోడ్లు వేస్తామని కూడా వ్యాఖ్యానించారు. ఇది ఎలాంటి పరిస్థితిని కల్పించిందనేది వైసిపికి అనుభవంలోకి వచ్చింది. సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల నిడివి తగ్గుతుంది. ఓటు బ్యాంకు తగ్గుతుంది. ప్రతి ఓటుకు విలువ ఏర్పడుతుంది.. `మీరు మాకు అవసరం లేదు` అనే ధోరణితో నాయకులు వ్యవహరించే పరిస్థితి కూడా ఉండదు.

ఎందుకంటే ప్రస్తుతం రెండు లక్షల 50 వేలు పైచిలుకు జనాభా ఒక ఎమ్మెల్యేకు ఓట్లు వేయాల్సి వస్తే.. వచ్చే ఎన్నికల నాటికి ఇది 1.30 ల‌క్ష‌ల‌ నుంచి 1.50 ల‌క్ష‌ల‌కు పడిపోతుంది. అంటే ఓట్లు వేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. దీనిని బట్టి ప్రతి ఓటు నాయకులకు అత్యంత కీలకం. ప్రతి ఓటరు అత్యంత ముఖ్యం. సో ఏ ఓటును వాళ్ళు వ‌దులు కోవడానికి ఉండదు. ఏ గ్రామాన్ని ఏ మండలాన్ని పక్కన పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి నాయకులకు ఓటు విలువ కూడా అత్యంత ముఖ్యంగా మారే పరిస్థితి భవిష్యత్తులో రానుంది. ఇప్పటివరకు ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఓటుకు నిర్దిష్టమైన విలువ ఏర్పడుతుంది.

కాబట్టి నాయకులు ఆ దిశగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సంక్షేమంపై దృష్టి పెట్టాలి. ప్రజలను తమకు సానుకూలంగా మలుచుకునే విధానాలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటం అనేది నాయకులకు సాధ్యమవుతుంది. వారి కల సాకారం అవుతుంది. లేనిపక్షంలో ప్రజలను మచ్చిక చేసుకున్న వారే విజయం సాధిస్తారు అన్నది వాస్తవం.