లోక్‌సభాపక్ష నేత లేకుండానే లోక్‌సభకు వైసీపీ! పాతవారే నేడు పగవారు
వైసీపీ 2024లో జరిగిన ఎన్నికలలో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 July 2025 6:00 AM IST21 రోజులు పార్లమెంటు సమావేశాలు..సుదీర్ఘంగా సాగే సమావేశాలు..! అందులోనూ పెహల్గాం ఉగ్రదాడిపై ఆపరేషన్ సింధూర్ ప్రతిస్పందన తర్వాత జరుగుతున్న సమావేశాలు..ఈ విషయం సహా మరికొన్ని కీలక అంశాల చర్చకు వచ్చే అవకాశం ఉన్న ఈ కీలక సమయంలో పార్లమెంటులో ఉండాలని ప్రతి పార్టీ కోరుకుంటుంది. ఆ పార్టీ పక్షనేత తమ వాయిస్‌ను వినిపించి.. ప్రజల్లో చర్చ రేగేలా చేస్తారు. కాగా, పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలు సంసిద్ధం అయ్యాయి.
తొలి రోజు సోమవారం ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ఆందోళకు దిగాయి. వారి నినాదాల మధ్యమే స్పీకర్ ఓం బిర్లా క్వశ్చన్ అవర్ చేపట్టారు. అయితే, వీరందరిదీ ఒక బాధ అయితే ఏపీ ప్రతిపక్షం వైసీపీదీ మరో బాధ.
వైసీపీ 2024లో జరిగిన ఎన్నికలలో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కడప, రాజంపేట, తిరుపతి, అరకు నుంచి మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు నెగ్గారు. కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాశ్‌రెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిలు హ్యాట్రిక్ సాధించారు. ఈ నేపథ్యంలో పీవీ మిథున్‌రెడ్డిని లోక్‌సభాపక్ష నేతగా వైసీపీ నాయకత్వం నియమించింది. కానీ, ఆయన ఇప్పుడు మద్యం కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు. పని దినాల పరంగా ఆగస్టు 21 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనుండగా.. ఆగస్టు 1 వరకు మిథున్‌రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది.
దీంతో ఆయనను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఇక ఆగస్టు 1 తర్వాత ఆయనకు రిమాండ్ పొడిగింపు ఉంటుందా? లేదా? అనేది చూడాలి. మద్యం కేసులో ఏ 4గా ఉన్నారు కనుక ఒకవేళ పొడిగింపు ఉంటే.. బహుశా పార్లమెంటు సమావేశాలకు పూర్తిగా దూరం కావడం ఖాయం. అంటే.. లోక్ సభా పక్ష నేత లేకుండానే వైసీపీ లోక్ సభా సమావేశాలకు హాజరవుతున్నట్లు.
కాగా, ఏపీ మద్యం కుంభకోణం గురించి గత పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా లేవనెత్తారు టీడీపీ ఎంపీ లావు శ్రీక్రిష్ణ దేవరాయలు. అప్పటినుంచే ఈ స్కాం గట్టిగా బిగుసుకుంటోంది. ఇక ఈ లోక్ సభ సమావేశాల్లో మద్యం స్కాం గురించి మళ్లీ లేవెత్తుతామని జనసేన ఎంపీ బాలశౌరి తెలిపారు. వీరిద్దరూ గత లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలే కావడం గమనార్హం. అంటే.. కుంభకోణం జరిగిందని చెబుతున్న సమయ ంలో వీరు వైఎస్సార్సీపీలోనే ఉన్నారన్నమాట.
