మౌనం వీడాల్సిందే ....వైసీపీ కొత్త వ్యూహం
ఒక్క మాటలో చెప్పాలీ అంటే పదవులు దాదాపుగా అందరికీ ఇస్తున్నారు. ఇక రానున్న కాలమంతా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నారు.
By: Satya P | 3 Oct 2025 6:00 AM ISTవైసీపీ ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. పైగా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంతో ఈ అయిదేళ్ళ కాలంలో ఎలాంటి ఎమ్మెల్సీ పదవి కానీ రాజ్యసభ సీటు కానీ ఎవరికీ ఇచ్చి గెలిపించుకోలేని పరిస్థితి ఉంది. ఇవ్వాల్సింది పార్టీ పదవులే. దాంతో భారీ ఎత్తున పార్టీలో పదవులు పందేరం జరుగుతోంది. పార్టీ ప్రధాన విభాగాల్లో అనుబంధ విభాగాల్లో అనేక పదవులు క్రియేట్ చేసి మరీ ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే పదవులు దాదాపుగా అందరికీ ఇస్తున్నారు. ఇక రానున్న కాలమంతా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరుతున్నారు.
వారిని దగ్గరకు తీస్తూ :
వైసీపీలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అంతే కాదు మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. అదే సమయంలో పార్టీలో పనిచేసి టికెట్ దక్కక పోటీ చేయలేని వారు ఉన్నారు. వీరంతా చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు దాంతో వీరికి పార్టీ పదవులు ఇవ్వడం ద్వారా చేరదీయాలని రానున్న కాలంలో వారిని ఉపయోగించుకోవాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది అని అంటున్నారు.
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో :
వైసీపీలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సీఈసీలో ఏకంగా 49 మందితో భర్తీ చేశారు. ఇందులో ఉన్న వారు అంతా మాజీలే కావడం విశేషం. ఉత్తరాంధ్రా వరకూ తీసుకుంటే అనేక మంది కనిపిస్తున్నారు విశాఖ నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి అమలాపురం మాజీ ఎంపీ అనూరాధా ఉన్నారు. అలాగే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామికి చోటు దక్కింది. అదే విధంగా 114 మందితో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎస్ ఈసీని ఏర్పాటు చేశారు. ఇందులో కూడా గతంలో ప్రభుత్వం ఉన్నపుడు తగిన అవకాశాలు రాని వారికి చోటు కల్పించారు.
మాజీలకు మంత్రం :
వీరందరికీ పదవుల పందేరంతో వైసీపీ ఒక చాన్స్ అయితే ఇచ్చింది. పార్టీలో కీలకంగా వీరిని మార్చే ప్రయత్నం జరిగింది. దాంతో వీరంతా జనంలోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేసే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటోంది. అంతకు ముందు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కూడా చాలా మందిని తీసుకున్నారు. ఇలా వైసీపీ రాష్ట్ర విభాగంలో అత్యున్నత వ్యవస్థలలో కీలక నేతలను నియమించడం ద్వారా ఫ్యాన్ రెక్కలకు జోరు పెంచాలని చూస్తున్నారు. మరి పార్టీ పదవులు ఇప్పటికే అందుకున్న వారిలో ఎంత మంది జనంలోకి వచ్చారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఓటమి చెంది దాదాపుగా ఏడాదిన్నరకు దగ్గర అవుతున్నా చాలా మంది నేతలు ఇంకా ఇంటి గడప దాటలేదు అన్నది కూడా సమాచారంగా పార్టీ పెద్దలకు వస్తోంది అని అంటున్నారు. మరి ఈ తాజా నియామకాలతో మాజీ మంత్రులు కీలక నేతలు అయితే ఎంతో కొంత జనంలో ఉంటే అది పార్టీకి మేలు చేస్తుంది అని భావిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
