కమ్మని పిలుపు : జగన్ కొత్త ఈక్వేషన్ !
ఏపీలో బలమైన సామాజిక వర్గాలు రాజకీయంగా దశాబ్దాలుగా ఆధిపత్యం చేస్తున్నవి ఉన్నాయి. అవే కమ్మలు రెడ్లు, ఈ రెండు పార్టీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి
By: Tupaki Desk | 19 Jun 2025 5:00 AM ISTఏపీలో బలమైన సామాజిక వర్గాలు రాజకీయంగా దశాబ్దాలుగా ఆధిపత్యం చేస్తున్నవి ఉన్నాయి. అవే కమ్మలు రెడ్లు, ఈ రెండు పార్టీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. అధికారం కోసం పోటీ కూడా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటూ వచ్చింది. అయితే ఎంత పోటీ ఉన్నా టీడీపీలో రెడ్లు ఉంటారు. వారు మంచి పదవులు అందుకుంటూ వచ్చారు.
అలాగే కాంగ్రెస్ లో కమ్మలు మంచి పొజిషన్లు అందుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖలను రాష్ట్రంలో కేంద్రంలో నిర్వహించారు. పరిస్థితి ఎక్కడ మారింది అంటే విభజన ఏపీలోనే అని చెప్పాలి. వైసీపీ వర్సెస్ టీడీపీ గా రాజకీయం రాజుకున్నపుడు సామాజిక ఆధిపత్య పోరు కూడా దానితో పాటే పెరిగింది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు కూడా ఎక్కువ మంది కమ్మ ప్రజానీకం ఆసక్తి చూపించారు.
అందుకే గుంటూరు, కృష్ణా జిల్లాలలో అత్యధిక సీట్లు వైసీపీకి దక్కాయంటే ఆ సామాజిక వర్గం వారి మద్దతు కారణం అని విశ్లేషణలు ఉన్నాయి. ఇక 2019 నుంచి 2024 మధ్యలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిని వ్యతిరేకించేలా మూడు రాజధానులు నినాదం అందుకోవడంతో ఆ సామాజిక వర్గంలో వ్యతిరేకత మొదలైంది అని చెబుతారు. అంతే కాదు కమ్మ వారికి మొదటి సారి కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చి రెండోసారి విస్తరణలో అసలు మంత్రి పదవి లేకుండా చేయడంతో వారిలో ఆగ్రహం మరింతగా పెరిగిందని అంటారు.
ఇక కమ్మ వారి ఆధిపత్యం ఉన్న విజయవాడ కార్పోరేషన్ లో బీసీలను మేయర్ చేయడం సామాజిక సమీకరణలకు ఓకేగా ఉన్నా తమ మీద టార్గెట్ గానే వారు భావించారు. అదే విధంగా వారికంటూ కొన్ని అసెంబ్లీ సీట్లు దశాబ్దాలుగా ఉంటే వాటిలో బీసీలను ఇతర సామాజిక వర్గాల వారిని దింపి తమకు రాజకీయంగా దూరం పెడుతున్నారన్న ఆవేదన కూడా కనిపించింది అని అంటారు.
అంతే కాదు వారి చేతుల్లో ఉన్న పవర్ ఫుల్ మీడియాను విమర్శించడంతో వదిలేయకుండా ఆయా మీడియాధిపతులను టార్గెట్ చేయడం తో కూడా వారిలో వైసీపీ పట్ల కొత్త చర్చ మొదలైంది అంటారు. అంతే కాదు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నత పదవులలో ఉన్న సందర్భంలో సైతం వారి విషయంలో వ్యవహరించిన తీరు కూడా ఆగ్రహానికి కారణం అంటారు.
అయితే ఇవన్నీ వైసీపీ కావాలని చేసిందా లేదా అన్నది పక్కన పెడితే ఆ సామాజిక వర్గం మీద కత్తి కట్టారు అన్న భావన ఏర్పడడానికి మాత్రం రీజన్ అయింది అని చెబుతారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందే చాలా మంది కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీని వీడారు. ఓటమి చెందాక అనేక మంది ఆలోచనలలో పడ్డారు.
ఇక వారిని ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం వేధిస్తోంది అని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే దాని వెనక రాజకీయ వ్యూహం ఉందని అంటారు. వైసీపీ తమ సామాజిక వర్గం మీద కత్తి కట్టింది అన్న భావజాలాన్ని వారిలోకి బలంగా వ్యాప్తి చేయడం జరిగిందని అంటారు. ఇంతకు ఇంత జరిగిన తరువాత వైసీపీ అధినాయకత్వం ఎట్టకేలకు మేలుకొంది అని అంటున్నారు.
జగన్ స్వయంగా కమ్మలను వెనకేసుకుని వస్తూ తాజాగా రెంటపాళ్ళ నుంచి చేసిన బిగ్ సౌండ్ వెనక కూడా ఒక స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంతో పెట్టుకుని రాజకీయంగా వైసీపీ నష్టపోయింది అన్నది కూడా ఉంది.
ఇక చూస్తే పార్టీలో ఉన్న వారు కూడా ఇబ్బందులతో కొత్త ఆలోచనలు చేసేలా ఉన్నారని అంటున్నారు దాంతో వారికి వెన్ను దన్నుగా అధినాయకత్వం నిలవాల్సిన సమయం సందర్భం కూడా ఉంది అని అంటున్నారు. అందుకే జగన్ కమ్మలు మా పార్టీలో ఉండకూడదా చంద్రబాబూ అని చాలా ఓపెన్ గా ప్రశ్నించారు.
ఒక కులం వారు ఒకే పార్టీలో ఉండాలని ఏమీ ఉండదు, రాజకీయంగా అది తప్పుడు వ్యూహం అవుతుంది కూడా. అందుకే ఈ రోజుకీ వైసీపీలోనూ కమ్మలు ఉన్నారు. అయితే వారి మీద కేసులు పడడం అన్నది ఒకటి ఉంది. దానికి వారి స్వయంకృతం కూడా తోడు అయింది అన్నది ఉంది. అదే సమయంలో తాము ఇబ్బందులు పడుతూంటే అధినాయకత్వం నుంచి భరోసా గట్టిగా లేదన్న వేదన ఉంది.
ఇలా అన్నీ కలసి మరీ వైసీపీ అధినేత నోటి వెంట ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేయించాయని అంటున్నారు. అయితే ఎవరు ఏ పార్టీలో ఉండాలో వారే డిసైడ్ చేసుకుంటారు. అడ్డుకోవడానికి అధినేతలు ప్రయత్నించినా అది జరిగేది కాదు. కాకపోతే పార్టీలే తమ విధానాలు ఆలోచనలు మార్చుకుంటే తాము అందరి వారమని ఆచరణాత్మకంగా రుజువు చేసుకుంటే కనుక తప్పకుండా అన్ని కులాలూ అన్ని పార్టీలలోనూ ఉంటాయి.
చేయాల్సింది మారాల్సింది అధినేతల ధోరణులు వైఖరులు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఒక బలమైన సామాజిక వర్గానికి బాసటగా నిలుస్తూ చేసిన ప్రకటన మాత్రం వైసీపీకి మేలు చేసేదే అంటున్నారు. ఇదే కాకుండా ముందు ముందు గుణాత్మకమైన మార్పు వైసీపీలోనూ రావాల్సి ఉందని అంటున్నారు.
