జగన్ ను ఇరుకున పెట్టేస్తున్న మిథున్ రెడ్డి.. అధినేత ఆలోచనపై సస్పెన్స్
వైసీపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానంగా మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆలోచనలు ఎవరికీ అంతుచిక్కడం లేదు.
By: Tupaki Desk | 26 Aug 2025 5:00 AM ISTవైసీపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానంగా మాజీ సీఎం, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఆలోచనలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లతో సతమతమైన మాజీ సీఎం జగన్ ఇప్పుడు తన ఆప్తమిత్రుడి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంగా వైసీపీ అనేక రకమైన సవాళ్లు ఎదుర్కొంది. ఇందులో ప్రధానమైనవి పార్టీ నేతలపై కేసులు, అరెస్టులు. సోషల్ మీడియా కేసులతో కేడర్ ను, అవినీతి, అక్రమాలు పేరిట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం వరుసగా అరెస్టు చేయిస్తోంది. ఒకరి తరువాత ఒకరిపై కేసులు నమోదు చేయడంతోపాటు నెక్ట్స్ అరెస్టు కాబోయేది ఫలానా అంటూ కొందరు నేతల పేర్లను ప్రచారంలోకి తీసుకువచ్చి అగ్గిరాజేస్తోంది.
ఈ పరిస్థితుల్లో కేడరుకు నైతిక స్థైర్యం కల్పించేలా అధినేత జగన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కేసుల్లో అరెస్టు అయిన వారికి న్యాయ సహాయం చేస్తున్నారు. అదే సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్లిన నేతల పరామర్శలకు వెళుతున్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేశ్ అరెస్టు అయితే గుంటూరు జైలుకు వెళ్లి జగన్ పరామర్శించారు. అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వంటివారిని కూడా జైలుకు వెళ్లి జగన్ ఓదార్చారు. కాకాణిని కలిసేందుకు ఒకసారి నెల్లూరు వెళ్లాలని భావించిన జగన్ కుదరకపోతే, రెండోసారి పట్టుబట్టి మరీ వెళ్లారు. ఇలా జైలుకు వెళ్లిన ప్రతినేతను పరామర్శిస్తున్న జగన్ తనకు అత్యంత ఆప్తులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి లిక్కర్ స్కాంలో నిందితులు. గత ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల విలువైన మద్యం స్కాం జరగిందని, ఇందులో ఎంపీ మిథున్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పాత్రపై పలు ఆరోపణలు చేస్తూ సిట్ అరెస్టు చేసింది. తొలుత చెవిరెడ్డిని ఆ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇద్దరిని వేర్వేరుగా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. విజయవాడ జైలులో రిమాండు ఖైదీలు ఎక్కువగా ఉండటం, భద్రతా కారణాల రీత్యా ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. సిటింగు ఎంపీ, అందునా మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన అరెస్టు అయిన నుంచి జగన్ రాజమండ్రి పర్యటనపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతవరకు రాజమండ్రి వెళుతున్నట్లు జగన్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల కాకపోవడంపై రాజకీయంగా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఎంపీ మిథున్ రెడ్డిని మిలాఖత్ లో కలిసేందుకు వైసీపీ నేతలు బారులు తీరుతున్నారు. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో వైసీపీ కీలక నేతలు రాజమండ్రి వస్తూనే ఉన్నారు. కానీ, అధినేత అటువైపు చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో జైలులో ఉన్న మిథున్ రెడ్డి కూడా జగనన్న కోసం వాకబు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన ఎప్పుడు వస్తారని ఆరా తీస్తున్నారని అంటున్నారు. తన ఆప్తమిత్రుడు తన కోసం తల్లిడిల్లిపోతున్నా, రాజమండ్రి వచ్చేందుకు జగన్ ముందుకు రాకపోవడానికి కారణమేంటి? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు. మరోవైపు సిట్టింగు ఎంపీ అయిన మిథున్ రెడ్డి బెయిలు కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇంతవరకు ఏ దశలో ఊరట దక్కలేదు.
మరోవైపు వచ్చేనెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేయాల్సివుంది. ఈ కారణంగా ప్రత్యేక అనుమతి ద్వారా జైలు నుంచి బయటకు తెచ్చేందుకు మిథున్ రెడ్డి కుటుంబం న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోందని అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా అయినా మిథున్ రెడ్డికి బెయిలు వస్తుందని ఆశించినా, ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో అయినా అనుమతి వస్తుందా? లేదా? అనేది అంతుచిక్కడం లేదు. ఈ తర్జనభర్జనల మధ్య అధినేత జగన్ ఒకసారి వచ్చి ఓదారిస్తే చాలు అని మిథున్ రెడ్డి అభిమానులు ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. అయితే న్యాయకోవిధులు మాత్రం జగన్ వ్యూహాత్మకంగానే మిథున్ రెడ్డిని కలిసేందుకు రావడం లేదని చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో దాఖలు చేసిన చార్జిషీటులో జగన్ పేరును సిట్ ప్రస్తావించింది. దీంతో తాను మిథున్ ను కలిస్తే ఆయన బెయిలు మంజూరు మరింత క్లిష్టమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాతోనే జగన్ ఆయనను కలవడం లేదని చెబుతున్నారు. ఏదిఏమైనా మిథున్ రెడ్డి జైలు జీవితం వైసీపీని తీవ్రంగా కదిలిస్తోందని చెబుతున్నారు.
