వైసీపీలో జగన్ వ్యతిరేకులు.. లోకేశ్ కు ఆ డౌట్ ఎందుకొచ్చిందబ్బా?
అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రకటించింది. రెండు సభల్లోనూ తమ వైఖరిని స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 4 April 2025 8:09 PM ISTవైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని వ్యతిరేకిస్తున్న వారు ఆ పార్టీలోనే ఉన్నారా? పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ చెప్పినట్లే నడుచుకున్న పార్టీ నేతలు.. ఇప్పుడు భిన్నవాదనలు వినిపిస్తున్నారా? అంటే రాష్ట్ర మంత్రి లోకేశ్ ఔననే అంటున్నారు. వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను చూస్తే వైసీపీలో జగన్ వ్యతిరేకులు ఉన్నట్లు తనకు అనుమానం వస్తోందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వైసీపీ ఎంపీల్లో ఒకరు వ్యతిరేకంగా ఓటు వేయలేదని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఈ బిల్లు విషయంలో ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందా? లేక జగనుకు వ్యతిరేకంగా పనిచేసే వర్గం ఉందా?’ అని లోకేశ్ ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లును విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ - జేపీసీకి పంపాలని టీడీపీ డిమాండ్ చేసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. అయితే జేపీసీకి వైసీపీ ఎటువంటి సవరణలను సూచించలేదని మంత్రి లోకేశ్ తెలిపారు.
అయితే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రకటించింది. రెండు సభల్లోనూ తమ వైఖరిని స్పష్టం చేసింది. కానీ, రాజ్యసభలోని ఓ వైసీపీ ఎంపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాటించలేదని మంత్రి లోకేశ్ ఎత్తిచూపారు. అంటే వైసీపీ అధినేత జగన్ ఆదేశాలను ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు పట్టించుకోవడం లేదని, అందుకే వైసీపీ అధినేతకు వ్యతిరేకంగా ఓ గ్రూపు ఉందని తనకు సందేహం వస్తుందని మంత్రి లోకేశ్ చెబుతున్నారు. టీడీపీ ఆరోపణలు ఎలా ఉన్నా ఈ ప్రచారం వైసీపీలోనూ కలకలం రేపింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినా ఒకరు పాటించకపోవడంపై ఆ పార్టీ హైకమాండ్ ఆరా తీస్తోందని అంటున్నారు.
