Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డి పెద్దరికం తగ్గుతోందా? ఉమ్మడి చిత్తూరులో వైసీపీలో ఇంట్రెస్టింగ్ టాపిక్

వైసీపీలో నెంబరు 2 స్థానంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత ప్రాంతంలో సెగ ఎక్కువైందన్న ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2025 4:00 PM IST
పెద్దిరెడ్డి పెద్దరికం తగ్గుతోందా? ఉమ్మడి చిత్తూరులో వైసీపీలో ఇంట్రెస్టింగ్ టాపిక్
X

వైసీపీలో నెంబరు 2 స్థానంలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత ప్రాంతంలో సెగ ఎక్కువైందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా, రాయలసీమ ప్రాంతంలో రాజకీయాలను శాసించిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు తన సొంత నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోందని అంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయన పెద్దరికాన్ని మాజీ ఎమ్మెల్యేలు సహించడం లేదని, ఎవరికి వారే తమ నియోజకవర్గంలో నాయకత్వం చేసుకోగలమని చెబుతున్నారని అంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి జోక్యాన్ని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని, వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండటానికి వైసీపీ ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పుంగనూరు నియోజకవర్గంలో తప్ప, మిగిలిన చోట్ల పెద్దిరెడ్డి కనిపించకపోవడాన్ని ఉదహరిస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ తర్వాత.. పార్టీలో ప్రభుత్వంలో పెద్దిరెడ్డి హవా ఎక్కువగా ఉండేదని అంటున్నారు. ఆయన కుమారుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడం, పెద్దిరెడ్డికి రాయలసీమలో మంచి పట్టు ఉండటంతో ఆయనను కాదని పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. అదే సమయంలో సీనియర్ నేతగా పెద్దిరెడ్డికి మాజీ సీఎం జగన్ కూడా అధిక ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో రాయలసీమకు తానే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరించేవారని అంటున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఆయన నాయకత్వాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్ కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ విజయానందరెడ్డి వ్యతిరేకించేవారని గుర్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డితో మిగిలిన నేతలకు విభేదాలు ఉన్నప్పటికీ అప్పట్లో బయటపడకుండా జాగ్రత్తగా ఉండేవారని, ఆయన పెద్దరికం చేయడాన్ని ఏ ఒక్కరూ అంగీకరించేవారు కాదని అంటున్నారు. అయితే ఇప్పుడు అధికారం లేకపోవడం, పెద్దిరెడ్డిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయన జోరు తగ్గింది. దీంతో పార్టీలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా స్పీడు పెంచినట్లు కనిపిస్తోందని అంటున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగిరిలో ఏ కార్యక్రమం చేసినా, పెద్దిరెడ్డిని ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో గతంలో పెద్దిరెడ్డి అండ చూసుకుని తనను ఇబ్బందులు పెట్టిన వారిని ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపేలా రోజా పావులు కదుపుతున్నట్లు చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో చిత్తూరు నియోజకవర్గానికి చెందిన ఆర్టీసీ మాజీ చైర్మన్ విజయానందరెడ్డి సైతం తన నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు జిల్లా మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డిని పక్కకు తప్పించి తానే కార్యక్రమాలు నడిపిస్తున్నారు విజయానందరెడ్డి. దీంతో పెద్దిరెడ్డి ప్రమేయం లేకుండానే చిత్తూరులో వైసీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా తిరుపతి, చంద్రగిరి వంటి నియోజకవర్గాల్లో సైతం పెద్దిరెడ్డి ప్రభావం లేకుండా ఆయా నియోజకవర్గాల నేతలు చూసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితి రాయలసీమ వ్యాప్తంగా ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ వ్యవహారాలను చక్కబెట్టిన పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంతోపాటు టీడీపీ కంచుకోట హిందుపురంలో వైసీపీని గెలిపిస్తానని చెప్పేవారు. అయితే ఆ రెండే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ అడ్రస్ కోల్పోవడంతో పెద్దిరెడ్డి చేసిందేమీ లేదని పార్టీలో ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గాలను తాము చక్కదిద్దుకుంటామని, పెద్దిరెడ్డి పెద్దరికం వద్దని పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానానికి తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పార్టీ కూడా పెద్దిరెడ్డికి ఎలాంటి పనులు అప్పగించడం లేదని అంటున్నారు. దీంతో అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలు తప్ప, మిగిలిన నియోజకవర్గాల వ్యవహారాల్లో పెద్దిరెడ్డి కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. గతంలో అధికారం ఉండటం వల్లే పెద్దిరెడ్డి హవా కనిపించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. పెద్దిరెడ్డి వల్లే తాము ఓడిపోయామని మరికొందరు నేతలు అంతర్గతంగా కుమిలిపోతూ.. ఆయనను తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టకుండా నిలువరించాలని కోరుతున్నారని అంటున్నారు.