వైసీపీలో గుసగుస : కోటరీలో కొత్త పోరు
ఈ నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అంటూ ఆయన అధినాయకత్వానికి నివేదికలు ఇస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతల అరెస్టులు జనంలో సానుభూతిని తీసుకుని వస్తున్నాయని కూడా చెబుతున్నారని అంటున్నారు.
By: Satya P | 5 March 2026 8:30 AM ISTవైసీపీలో కోటరీ ఉందని పార్టీ నుంచి బయటకు వెళ్ళిన విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీలో జగన్ తర్వాత తాను నంబర్ టూ అని ఎపుడూ అనుకోలేదని కూడా ఆయన చెప్పారు. అయితే తనను తరువాత కొందరు పార్టీకి అధినేతకూ దూరం చేశారు అని కూడా ఘాటు విమర్శలు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే కోటరీ వైసీపీలో ఉంది అన్నది విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ వాదన.
ఆయన చుట్టూనే అంటూ :
ఇక వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి చక్రం తిప్పుతారు అని పార్టీలో నుంచి బయటకు వెళ్ళిన వారు అంతా విమర్శలు చేసిన సంగతి కూడా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఇపుడూ కూడా ఆయన హవాయే సాగుతోంది అన్న మాట కూడా ప్రచారంలో పెడుతూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో పరిస్థితులు మారుతున్నాయని అంటున్నారు. కోటరీలో కొత్త పేర్లు వస్తున్నాయని అంటున్నారు. అలా సరికొత్త పోటీ మొదలైంది అని అంటున్నారు.
చెవిరెడ్డి రాకతో :
వైసీపీలో ఇపుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన చాలా కాలం జైలు జీవితం అనుభవించి వచ్చారు. లిక్కర్ కేసులో ఆయన జైలుకు వెళ్ళారు ఇక ఆయన వచ్చిన తరువాత తన నియోజకవర్గం తన బాధ్యతలు అన్నవి కాకుండా ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయం అయిన తాడేపల్లి నుంచే రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ గ్రాఫ్ పెరిగింది అంటూ :
ఈ నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అంటూ ఆయన అధినాయకత్వానికి నివేదికలు ఇస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతల అరెస్టులు జనంలో సానుభూతిని తీసుకుని వస్తున్నాయని కూడా చెబుతున్నారని అంటున్నారు. వైసీపీదే విజయం అంటూ ఆయన ఇస్తున్న రిపోర్టులు కానీ సర్వే అంచనాలు కానీ పార్టీలో కీలకంగా ఆయన ఉండేందుకే అని అంటున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉంటే చెవిరెడ్డి రాకతో సజ్జల వర్గం కొంత అసహనం వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు.
జగన్ కి అండగా :
వైసీపీలో జగన్ కి అన్ని విధాలుగా అండగా ఉంటూ పార్టీ విషయాలలో చేదోడు వాదోడుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటూ వచ్చారని అంతా అంటున్నారు. అయితే ఇపుడు ఆయనకు చెక్ పెట్టేలా చెవిరెడ్డి దూకుడు సాగుతోంది అని పార్టీలో కీలక నేతలు గుసగుసలాడుతున్నారుట. అంతే కాదు 2024 ఎన్నికల ముందు చెవిరెడ్డి ఇచ్చిన సర్వేలు ఫెయిల్ అయ్యాయని గుర్తు చేస్తున్నారుట. వాటిని నమ్ముకుని వైసీపీ తీవ్రంగా నష్టపోయింది అని అంటున్నారు. ఇపుడు మళ్ళీ ఎన్నికలకు మూడేళ్ళకు పైగా సమయం ఉండగా సర్వే నివేదికలు వెల్లడించడం అంతా బాగుంది అని ఫీలింగ్స్ ఇవ్వడం వల్ల పార్టీకి మంచి కంటే చేటు జరుగుతుంది అని అంటున్నారు.
కేరాఫ్ తాడేపల్లిగా :
ఇక చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ఆయన ఫిక్స్ అయ్యారు. నిజానికి 2024 లో కూడా కుమారుడే పోటీ చేశారు. అలా తన రాజకీయ వారసుడిని ముందు పెట్టి తాను మాత్రం తాడేపల్లిలోనే ఉంటూ కేంద్ర కార్యాలయాంలో కీలకం కావాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి తాడేపల్లికే మకాం మార్చారని అధినేతకు సన్నిహితంగా ఉంటూ అక్కడ పనులు చక్కబెడుతున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. అయితే చెవిరెడ్డి నివేదికలు కానీ ఆయన సర్వేలు అంచనాలు కానీ సజ్జల వంటి వారు వ్యతిరేకిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక అధినాయకత్వం కూడా చెవిరెడ్డికి ఇపుడు కొంత ప్రాధాన్యత ఇస్తున్న విధంగా ఉందని అంటున్నారు. దీంతో కోటరీలో కొత్త రాజకీయం మొదలైంది అని అంటున్నారు. మరి చూడాలి దీనిని ఆధిపత్య పోరుగా చూడాలా లేక మరే విధంగా చూడాలా అన్నది.
