కందికుంటకు కలిసొస్తున్న వైసీపీ రాజకీయం ..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ కు సొంత పార్టీ రాజకీయాల కంటే కూడా ప్రత్యర్థి పార్టీలో నెలకొన్న బలహీనతలు ఆయనకు అనుకూలం గా మారుతున్నాయి
By: Garuda Media | 15 April 2026 9:00 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కందికుంట వెంకటప్రసాద్ కు సొంత పార్టీ రాజకీయాల కంటే కూడా ప్రత్యర్థి పార్టీలో నెలకొన్న బలహీనతలు ఆయనకు అనుకూలం గా మారుతున్నాయి. టిడిపి తరఫున సుదీర్ఘ విరామం తర్వాత విజయం సాధించిన కందికుంటకు స్థానికం గా బలమైన కేడర్ ఉంది. బలమైన నాయకత్వం కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.
అయితే సహజంగా కదిరి నియోజకవర్గంలో వైసిపి వరుసగా విజయం దక్కించుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మారే అవకాశం ఉంటుందన్నది రాజకీయాల్లో చర్చగా మారింది. కానీ క్షేత్రస్థాయిలో కదిరి నియోజకవర్గం వైసీపీ రాజకీయాలు త్రిముఖ పోరుగా మారాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు అత్తరు చాంద్ బాషా, మక్బుల్, పూల శ్రీనివాసరెడ్డి మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. 2029 ఎన్నికల్లో టికెట్ తనకే ఇస్తారని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు.
ఫలితంగా కేడర్ కూడా ఒక సందిగ్ధ అవస్థలో కూరుకుపోయింది. దీంతో ఎవరికి వారుగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఎవరికివారుగా నియోజకవర్గంలో విభజన పాలిటిక్స్ కు తెర తీశారు. ఫలితంగా ఈ ప్రభావం టిడిపికి అనుకూలంగా మారింది. ముఖ్యంగా స్థిరమైన రాజకీయాలు చేసే నాయకుడిగా కందికుంటకు ఈ పరిణామాలు కలిసి వస్తున్నాయి. దీంతో రాజకీయంగా ఆయనకు మరోసారి తిరుగు లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కందికుంట విజయం దక్కించుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
సమన్వయ లోపంతో వైసిపి లో నెలకొన్న పొలిటికల్ పరిస్థితులు సహజంగా ప్రత్యర్థులకు బలాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. దీనికి తోడు 2024 ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సిద్ధారెడ్డిని తప్పించి వైసిపి పెద్ద పొరపాటు చేసిందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. మొత్తంగా వైసీపీలో నెలకొన్న ఈ అంతర్గత రాజకీయ కుమ్ములాటలు అధిపత్య పోరు వంటివి కందికుంటకు వరంగా మారుతున్నాయన్నది స్థానిక రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
