వైసీపీ కేంద్ర కార్యాలయానికి టులెట్ బోర్డు..
ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలోని తాడేపల్లిలో విశాలమైన స్థలంలో నెలకొల్పిన వైసీపీ ముఖ్య కార్యాలయం మొన్నటి వరకు చాలా సందడిగా ఉండేది.
By: Tupaki Desk | 5 April 2025 7:59 AMఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలోని తాడేపల్లిలో విశాలమైన స్థలంలో నెలకొల్పిన వైసీపీ ముఖ్య కార్యాలయం మొన్నటి వరకు చాలా సందడిగా ఉండేది. దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు అంతస్తులతో నిర్మించిన ఈ భవనాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందుగానే కట్టించారు. పార్టీ ఆఫీసును ప్రధాన రహదారికి దగ్గరగా నిర్మించిన జగన్, దాని వెనకాల తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రోడ్డు వైపు ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయం యొక్క గాజులతో చేసిన భవనానికి అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు కనబడుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ భవనాన్ని అద్దెకు తీసుకోవచ్చు.
వైసీపీ కేంద్ర కార్యాలయానికి అద్దె బోర్డు ఏమిటి? జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఆయనను, ఆయన పార్టీని అవహేళన చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ భవనానికి అద్దె బోర్డు పెట్టారని కొందరు అనుకున్నారు. కానీ ఇది నిజం. చుట్టూ అద్దాలతో ఎంతో అందంగా నిర్మించిన ఆ భవనానికి జగన్ అండ్ కో నిజంగానే అద్దెకు ఉంది అనే బోర్డును పెట్టేశారు. దీనికి సంబంధించిన స్పష్టమైన ఫోటోలు శనివారం నాటి ముఖ్య మీడియాలో ప్రచురితమయ్యాయి.
వైసీపీ కేంద్ర కార్యాలయంగా ఉన్నప్పుడు ఆ భవనం ఎలా ఉండేది? ఇప్పుడు అద్దెకు ఇవ్వడానికి సిద్ధం చేసిన తర్వాత అది ఎలా ఉంది? దానికి ఇప్పుడు అద్దె బోర్డు వేలాడుతున్న దృశ్యాలను చూపే ఫోటోలు మీడియాలో బాగా వ్యాప్తి చెందుతున్నాయి.
2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలను తమకు తాము కేటాయించుకుని పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంది. అయితే 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలైన తరువాత ఆ కార్యాలయాలను పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో చాలా భవనాల ముందు అద్దెకు ఉంది అనే బోర్డులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా వైసీపీ ముఖ్య కార్యాలయానికే అద్దె బోర్డు వేలాడటం నిజంగా ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ భవనంలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని జగన్ తన కోసం నిర్మించుకున్న విశాలమైన నివాసంలోని కొంత భాగంలోకి మార్చారట. అందువల్ల ఈ భవనం ఖాళీ కావడంతో దానిని ఇప్పుడు అద్దెకు ఇవ్వడానికి బోర్డు పెట్టారట. ఈ భవనాన్ని ఏ సంస్థ అద్దెకు తీసుకుంటుందో వేచి చూడాలి.