ఈ సారీ 'వారసుల'కు సారీనేనా ..!
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేకమంది నాయకులు తమ వారసులను నిలబెట్టాలని భావించారు, ముఖ్యంగా వైసిపి నుంచి ఈ డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి.
By: Tupaki Desk | 22 April 2025 5:00 PM ISTగత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేకమంది నాయకులు తమ వారసులను నిలబెట్టాలని భావించారు, ముఖ్యంగా వైసిపి నుంచి ఈ డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇది అత్యంత కీలకమైన ఎన్నికని ఈసారి మనం విజయం సాధించేందుకు జూనియర్లు పనికిరారని భావించిన వైసీపీ అధినేత జగన్ కొత్తవారికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. అలాగని అసలు అవకాశాలు ఇవ్వకుండా చేశారా అంటే కొంతమంది కొత్త వారిని తీసుకొచ్చారు. తిరువూరు, సింగనమల లాంటి చోట్ల నిలబెట్టారు.
అయితే ఆయన చేసిన ప్రయోగాలు వికటించాయి. ఆయన నిలబెట్టిన కొత్త వారితో పాటు సీనియర్లు కూడా కూటమి తుఫానులో కొట్టుకుపోయారు. ఇక వచ్చే ఎన్నికల కోసం కొంతమంది నాయకులు ఇప్పటి నుంచి తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. వీరిలో ధర్మాన ప్రసాదరావు తనయుడు అదేవిధంగా ధర్మాన కృష్ణ దాస్ తనయుడు ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు ప్రధానంగా తెర మీదకు వచ్చారు. ప్రస్తుతం తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీనిపై పెద్దగా ప్రచారం రావట్లేదు కానీ ఆయన గ్రామాల్లో తిరుగుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ధర్మాన ప్రసాదరావు అంటీ మట్టినట్టు ఉన్నప్పటికీ తన కుమారుడిని వచ్చేసారి ఎన్నికల్లో వైసిపి నుంచి నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇక కృష్ణ దాస్ ఇప్పటికే రిటైర్మెంట్ పై సూచనలు ఇచ్చేశారు. తాను రిటైర్ కాబోతున్నట్టు ప్రకటించుకున్నారు. దీంతో ఆయన కుమారుడు ఎంట్రీ దాదాపు ఖాయమైనట్టు సమాచారం.
మరి వచ్చే ఎన్నికల సమయానికి వైసీపీ కొత్తవారికి అవకాశం కల్పిస్తుందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్పించే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మళ్లీ ఎన్నికలు కూడా ఇంతే టైట్‌గా ఇంతకన్నా ఎక్కువ పోటీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మూడు పార్టీలు కలిసి ఉండటం, పైగా పవన్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా కొనసాగుతూ ఉండటం చంద్రబాబుకు కూడా గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో వైసిపి మరోసారి కూడా వారసులకు అవకాశం లేకుండా రాజకీయాలకు వెళుతుందనే తెలుస్తాది.
ముఖ్యంగా సీనియర్లకు ఉన్న హవా జూనియర్లకు లేకపోవడం అదేవిధంగా జూనియర్లను చూసి ప్రజలు ఓటు వేసే పరిస్థితి కనిపించిన నేపథ్యంలో వైసిపి అధినేత ఈ నిర్ణయం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, గత ఏడాది పరిస్థితిని చూస్తే పుట్టపర్తి లాంటి చోట్ల కొత్తవారిని గెలిపించారు. అదేవిధంగా గుంటూరు వెస్ట్ లో కూడా కొత్త ముఖాలను ప్రజలు గెలుపు గుర్రం ఎక్కించారు. కాబట్టి సీనియర్లు అయితే గెలుస్తారు... జూనియర్లైతే ఓడిపోతారు అనే చర్చ కన్నా పార్టీని బలోపేతం చేస్తే క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువై వారి సమస్యలు పట్టించుకుంటే ఈ సమస్య ఉండదని సీనియర్లు జూనియర్లు అనే వాదన కనిపించదని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ విషయంపై వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం గమనార్హం.
