వైసీపీ టాక్: ఆమెకు టికెట్ ఇస్తే.. ఓడిస్తాం ..!
వైసిపికి కలిసి వచ్చిన నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒకటి. వరస విజయాలు దక్కించుకున్న వైసిపి ఇక్కడ రికార్డు సాధించింది.
By: Garuda Media | 25 April 2026 12:00 AM ISTవైసిపికి కలిసి వచ్చిన నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒకటి. వరస విజయాలు దక్కించుకున్న వైసిపి ఇక్కడ రికార్డు సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ మహమ్మద్ ముస్తఫా విజయం సాధించారు. పార్టీ తరఫున మైనారిటీ వర్గాలను ఏకం చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటువంటి కీలక నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీ ప్రయోగం చేసింది. ముస్తఫా కోరిక మేరకు ఆయన కుమార్తె నూరి ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించింది.
కానీ క్షేత్రస్థాయిలో మైనారిటీలను కూడగట్టడంలో ముస్తఫా విఫలమయ్యారు. ఫలితంగా భారీ తేడాతో నూరి ఫాతిమా పరాజయం పాలయ్యారు. 31 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. ఇక ఆ తర్వాత కూడా పార్టీ ఆమెని ఇన్చార్జిగా కొనసాగిస్తోంది. కానీ, ప్రస్తుతం పార్టీ పరంగాను క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే నూరి ఫాతిమా రాజకీయాలు వైసిపికి కలిసి రావడం లేదు. వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే క్రమంలో అందరినీ కలుపుకొని పోయే లక్షణాన్ని ఆమె వదిలిపెట్టారని పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.
అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఆమె కనక మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయం అని ఇప్పుడే చెప్పేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఎవరు అంచనా వేయలేరు.. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకుంటున్న సీనియర్ నాయకులు అంతర్గత సమావేశాల్లో ఈ విషయాన్ని సజ్జలు రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ముస్తఫా పై ఉన్న అభిమానం కొద్దీ ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చామని వచ్చే ఎన్నికల్లో పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేస్తామని సజ్జల వారికి హామీ ఇచ్చారు.
ఈ హామీని ఏ మేరకు నిలబెట్టుకుంటారు అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కచ్చితంగా నూరి ఫాతిమాకు మళ్ళీ టిక్కెట్ ఇస్తే సొంత నాయకులే ఓడించే పరిస్థితి ఉందన్నది స్పష్టమవుతోంది. ఇటీవల కూడా రంజాన్ సందర్భంగా పార్టీ ఇవ్వాలనుకున్న ఇఫ్తార్ విందు విషయంలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. నూరి ఫాతిమా వ్యవహారం వల్లే ఇఫ్తార్ విందు గుంటూరు నగరం నుంచి విజయవాడ నగరానికి మార్చుకోవాల్సి వచ్చింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం లో మార్పు అయితే ఖాయమని అంచనా వేస్తున్నారు. తిరిగి ముస్తాఫానే పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.
