Begin typing your search above and press return to search.

వైసీపీ కిచెన్ క్యాబినెట్...మాజీ మంత్రులు రెడీనా ?

వైసీపీ ఇపుడు ఒట్టి ప్రతిపక్షం కాదు, అయిదేళ్ళ పాటు అధికారం చేపట్టి విపక్షంలోకి వచ్చిన పార్టీ.

By:  Satya P   |   14 July 2026 9:19 AM IST
వైసీపీ కిచెన్ క్యాబినెట్...మాజీ మంత్రులు రెడీనా ?
X

వైసీపీ ఇపుడు ఒట్టి ప్రతిపక్షం కాదు, అయిదేళ్ళ పాటు అధికారం చేపట్టి విపక్షంలోకి వచ్చిన పార్టీ. అందువల్ల ఆ పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి. పైగా కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రతీ విషయానికి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇలాగ జరిగింది, అంతా వినాశనం అంటూ మాట్లాడుతున్నారు. దానికి వైసీపీ నుంచి గత రెండేళ్ళుగా చూస్తే ఎలాంటి గట్టి రియాక్షన్ అయితే రాలేదు. అడపా తడపా కౌంటర్ చేయడం తప్పించి అంతా సైలెంట్ మోడ్ లోనే మొత్తం జగన్ కేబినెట్ మంత్రులు ఉన్నారని అంటున్నారు. జగన్ తొలి విడతలో పాతిక మందిని తీసుకున్నారు. మలి విడతలో సీనియర్లను పక్కన పెట్టి మరింత మందిని తీసుకున్నారు. ఈ లెక్కన 42 మందికి పైగా మాజీ మంత్రులు వైసీపీ తరఫున పనిచేశారు. వీరిలో కొందరు పార్టీ వదిలినా నికరంగా ఉన్న వారు ఫ్యాన్ నీడనే కనిపిస్తున్నారు.

నోరెత్తరేమిటి అంటూ :

ఇక వైసీపీ నుంచి సరైన కౌంటర్లు కానీ కూటమి ప్రభుత్వం చేసే విమర్శలకు జవాబు చెప్పే పరిస్థితి కానీ లేకుండా పోతోంది అని అంటున్నారు. కొందరు మంత్రులు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. వారు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అయితే పాలనాపరంగా వైసీపీ ఫెయిల్ అని గత ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక్క ప్రాజెక్ట్ కానీ రాలేదని పెట్టుబడులు కూడా ఎక్కడా రాలేదని కూటమి ప్రభుత్వ పెద్దలు ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయం తీసుకున్నా గత ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వం అయితే మాజీ మంత్రులు ఎంతో మంది కూడా తమ శాఖల మీద కూటమి మంత్రులు విమర్శలు చేసినపుడు తిరిగి స్పందించరేంటి అని గుస్సా అవుతోంది అని అంటున్నారు.

ధీటైన రియాక్షన్ కోసం :

దీంతో వైసీపీ నుంచి ఇక మీదట ధీటైన రియాక్షన్ కోసం గతంలో ఏ ఏ శాఖలు చూశారో ఆయా మాజీ మంత్రులు అంతా ముందు వరసలోకి వచ్చి కూటమికి గట్టిగా జవాబు ఇవ్వాలని అధినాయకత్వం కోరుతోంది. గతంలో ఆయా శాఖలను చూసిన వారు అయితేనే సాధికారికంగా వివరాలు చెప్పగలరని ప్రజలలో కూడా వాటికి విలువ ఉంటుందని జనాలకు సైతం ఎక్కుతుందని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నరు. ఇక జగన్ తాను తరచూ మీడియా ముందుకు వచ్చి అన్ని శాఖల మీద మాట్లాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఆయన కాకుండా మాజీ మంత్రులు కూడా స్పందించారు అని అంటున్నారు.

వైసీపీ కేబినెట్ గా :

ఇక కూటమి అధికారంలో ఉంది. దాంతో ఆయా శాఖలకు మంత్రులు ఉన్నారు, మరి విపక్షంలో వైసీపీకి కూడా ఆ శాఖలను చూసిన మాజీ మంత్రులు ఉన్నారు. ఎవరి ఎపుడు ఎక్కడ మాట్లాడినా దానిని కౌంటర్ చేసే విధంగా వైసీపీ నుంచి మాజీ మంత్రులు కూడా యాక్టివ్ గా రియాక్ట్ కావాలని పార్టీ సూచిస్తోంది అని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ క్యాబినెట్ మంత్రులు అంటూ రానున్న రోజులలో మీడియా ముందుకు రావాలని అంటోంది. అయితే చాలా మంది మాజీ మంత్రులు అయితే స్విచాఫ్ మోడ్ లో ఉన్నారని అంటున్నారు. గడచిన రెండేళ్ళలో వారు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదని అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయని అంటున్నారు. వీరి విషయంలో అధినాయకత్వం మాత్రం సీరియస్ గానే ఉందని అంతా రంగంలోకి దిగాలని ఆదేశించనుందని వార్తలు వస్తున్నాయి. మరి మాజీలు గొంతు విప్పుతారా అన్నదే చర్చ. విప్పితే మాత్రం రాజకీయ రచ్చ ఖాయం. కానీ వైసీపీ అధినాయకత్వం అమలు చేయబోయే ఈ కిచెన్ క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉంటారు, వారిలో ఎంత మంది ముందుకు వస్తారు అన్నదే ఇపుడు కీలక చర్చగా ఉంది మరి. చూడాలి ఏమి జరుగుతుందో.