గన్నవరంలో వల్లభనేని వంశీ? మళ్లీ ఏమైంది!
అయితే, ఆయన విషయంలో పక్కా ప్లాన్ చేసుకున్న ప్రభుత్వం.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారని ఫిబ్రవరిలో మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేసింది.
By: Tupaki Desk | 26 Sept 2025 4:00 AM ISTవైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన సొంత నియోజకవర్గం గన్నవరంలో కొద్దిసేపు సందడి చేశారు. కొద్దిరోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఆయన ఆకస్మికంగా మళ్లీ పర్యటించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పెద్దగా హడావుడి చేయకపోయినా, కొద్దిమంది ముఖ్యనేతలతో ఆయన మాట్లాడటం ఆసక్తిరేపింది. రాజకీయాల నుంచి వల్లభనేని వైదొలుగుతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై ఆయన ఎక్కడా స్పందించలేదు. మౌనం అర్థాంగీకారమే అన్నట్లు అంతా అనుకుంటున్న సమయంలో వంశీ గన్నవరంలో అడుగుపెట్టి మరో కొత్త చర్చకు తెరలేపారు.
గత ప్రభుత్వంలో వైసీపీ తరఫున చురుకుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్ అయ్యారు. గతంలో ఆయన మాట్లాడిన తీరు, చేసిన విమర్శలతో కూటమిలోని సాధారణ కార్యకర్తల నుంచి అధినేత వరకు అందరూ కన్నెర్రజేయడంతో వంశీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఆయన ఇంటిపై దాడి జరగడం చూస్తే కూటమి కార్యకర్తల్లో ఆయనపై ఎంత ఆగ్రహం ఉందో వెల్లడైంది. అయితే ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు అండర్ గ్రౌండుకు వెళ్లిన వంశీ, పరిస్థితులు సర్దుమణిగాక మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వద్దామని భావించారు.
అయితే, ఆయన విషయంలో పక్కా ప్లాన్ చేసుకున్న ప్రభుత్వం.. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారని ఫిబ్రవరిలో మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్టు చేసింది. సుమారు 140 రోజులపాటు రిమాండులో ఉంచిన ప్రభుత్వం వంశీపై వరుస కేసులు నమోదు చేసింది. కేసు తర్వాత కేసు పెట్టి వంశీకి బెయిలు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని కూడా చెబుతారు. ఈ పరిస్థితుల్లో 140 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ, జైలు జీవితంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలోనే రాజకీయాలకు స్వస్తి పలకాలని ఆయన నిర్ణయించుకున్నారని అంటున్నారు.
అయితే వైసీపీ ఆయన కోరికను మన్నిస్తూనే వంశీ స్థానంలో ఆయన సతీమణి పంకజశ్రీకి గన్నవరం వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో నియోజకవర్గ భారం మళ్లీ వంశీపైనే పడిందని అంటున్నారు. దీంతో ఆయన చాపకింద నీరులా తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించారని అంటున్నారు. తాను యాక్టివ్ గా తిరిగి మళ్లీ కూటమి పెద్దలను రెచ్చగొట్టకుండా, తెరచాటుగా నియోజకవర్గంలో తిరిగి బలం పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే బుధవారం గన్నవరం వచ్చిన ఆయన తనకు అత్యంత సన్నిహితులు, హితులుతో మాట్లాడారు.
భవిష్యత్ రాజకీయాలపై సమాచాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే మునిపటిలా వంశీ దూకుడుగా రాజకీయం చేసే పరిస్థితులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలుకు వెళ్లకముందు పుష్టిగా కనిపించిన వంశీ.. 140 రోజుల రిమాండులో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ముఖం కళావిహీనంగా మారిందని, అత్యంత నీరసంగా కనిపిస్తున్నారని అంటున్నారు. గతంలో నిండు చంద్రుడిలా వెలిగిపోయిన వంశీ ముఖంలో ఇప్పుడు ఆ తేజస్సు కనిపించడం లేదు. దీంతో ఆయన ఇంకా మానసికంగా బలపడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
