వాలంటీర్లే వైసీపీని ఓడేలా చేశారు.. ‘గుడివాడ’ నోట కొత్తమాట
తాజాగా తమ ఓటమికి కారణాల్ని ఆయన సరికొత్తగా చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 6 May 2025 4:41 AMఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాదికి దగ్గరవుతోంది. ఇప్పటికి ఓటమికి కారణాల్ని అన్వేషించే పనిలోనే వైసీపీకి చెందిన పలువురు నేతలు బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల్ని అమలు చేశామని చెప్పుకొచ్చారు. అయినప్పటికి తాము ఓడిపోవటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా తమ ఓటమికి కారణాల్ని ఆయన సరికొత్తగా చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థే తమను దెబ్బ తీసిందని.. వారే ఎన్నికల్లో తమ పార్టీ ఓడేందుకు కారణమయ్యారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు.. వాలంటీర్లు.. సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాల్ని అందించామని.. కానీ అదే వాలంటీర్లు తమ ప్రభుత్వం ఓడిపోయేందుకు కారణమయ్యారన్నారు.
తాజాగా అనకాపల్లిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ.. ఎన్నికల వేళలో వాలంటీర్లు రాజీనామా చేస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలామంది ముందుకు రాలేదన్నారు. కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని చెప్పినా వినలేదన్న ఆయన.. మొత్తంగా వాలంటీర్ల వల్లే తాము అధికారాన్ని కోల్పోయామని వివరించారు. రానున్న రోజుల్లో పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్న గుడివాడ అమర్నాథ్.. ఓటమిపై ఇంకేం చెబుతారో?