'ఒక్కడు' చేసిన పని.. జగన్‌కు బిగ్ మైనస్ ... !
ఒక పార్టీని నిలబెట్టేందుకు.. ఒక్కడు చాలడు. ఎంతో మంది అవసరం ఉంటుంది. ఇంటికో పువ్వు.. ఈశ్వరుడికి ఓ మాల .. అన్నచందంగా.. అందరూ కలిసి పనిచేస్తే పార్టీ నిలబడుతుంది.
By: Tupaki Desk | 9 Jun 2025 11:30 AMఒక పార్టీని నిలబెట్టేందుకు.. ఒక్కడు చాలడు. ఎంతో మంది అవసరం ఉంటుంది. ఇంటికో పువ్వు.. ఈశ్వరుడికి ఓ మాల .. అన్నచందంగా.. అందరూ కలిసి పనిచేస్తే పార్టీ నిలబడుతుంది. అది కూడా.. ఎంతో శ్రమిస్తేనే జరుగుతుంది. ఇది గత ఎన్నికల్లో టీడీపీ సహా కూటమి నుంచి చూశాం. అదేవిదంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి కూడా చూశాం. కానీ.. అదే పార్టీని డ్యామేజీ చేయడానికి `ఒక్కడు` చాలు.
ఒకే ఒక్కడు చేసే తింగరి పనులు.. పార్టీని పూర్తిగా డైల్యూట్ చేస్తాయనడానికి వైసీపీ ఐదేళ్ల కాలంలో జరిగిన కొన్ని పనులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన పని.. పార్టీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. సొంతమాజీ డ్రైవర్‌ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారన్న వాదన ఉంది. దీనిపై పార్టీ కఠిన చర్యలు తీసుకోలేదు.
ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. తద్వారా ఒక్కడు చేసిన పనికి వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. ఇక, హిందూపురం అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన ఇల్లీగల్ యాక్టివిటీ అందరికీ తెలిసిందే. దీనిని కూడా పార్టీ ఖండించలేకపోయింది. పైగా.. అధికారంలో ఉండగా.. ఆయన చేసిన పనిని సమర్థించి.. చేతులు కాల్చుకుంది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ వ్యవహారాన్ని అప్పటి ముఖ్యమంత్రిగా జగన్ ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు.
ఇది పార్టీకి ఎంత డ్యామేజీ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా పార్టీ యాక్టివిస్టు.. రౌడీ షీట్ కూడా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు.. మరింతగా పార్టీని `బజారు`న పడేశాయి. ఇలా.. ఒక్కడు చేసిన పనులు.. వైసీపీని అధికారం నుంచి దింపేశాయి. ఇక, ఇప్పుడు కూడా.. కృష్ణం రాజు అనే ఒక్కడు చేసిన పని.. పార్టీ జెండానే కుదిపేస్తోంది. భుజాలపై జెండా మోసేవారు కూడా.. భయపడే పరిస్థితిని తీసుకువచ్చింది. గతంలోనే ఇలాంటివి ఖండించి ఉంటే.. కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు.