Begin typing your search above and press return to search.

విశాఖ వైసీపీకి నాధుడేడీ ?

విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ సైతం మీడియాకే పరిమితం అయ్యారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 April 2025 11:16 PM IST
విశాఖ వైసీపీకి నాధుడేడీ ?
X

వైసీపీకి విశాఖలో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. పార్టీని తమ భుజాల మీద మోసే వారు కరవు అయ్యారు. కీలకమైన జీవీంసీ మేయర్ సీటుని కాపాడుకునే విషయంలో ఫ్యాన్ పార్టీకి వ్యూహాలు కరవు అయి సతమతమవుతోంది. రీజనల్ కో ఆర్డినేటర్ గా కొత్తగా నియమితులైన మాజీ మంత్రి కురసాల కన్నబాబు మేయర్ పదవిని కాపాడేందుకు ఏ వ్యూహాలు రచించారో తెలియడం లేదు అని అంటున్నారు. ఆయన ఈ కీలక సమయంలో ఎక్కడ ఉన్నారో అని చర్చించుకుంటున్నారు.

మరో వైపు చూస్తే సీనియర్ నేత మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన తన వ్యూహాలకు పదును పెట్టడం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన ఎంతసేపూ మీడియా సమావేశాలు పెట్టి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడం కూటమి సర్కార్ ని విమర్శించడానికే పరిమితం అవుతున్నారని అంటున్నారు

విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ సైతం మీడియాకే పరిమితం అయ్యారని అంటున్నారు. విప్ జారీ చేస్తామని చెప్పి మేయర్ మీద అవిశ్వాసం వేళ ఆ పార్టీ చేతులెత్తేసింది అని అంటున్నారు. విప్ జారీ చేయడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుందని అంటున్నారు. పార్టీ మారే వారు అంతా అధికార పక్షం వైపు వెళ్తున్నారు.

దాంతో వారి పదవుల రక్షణ బాధ్యతలు తీసుకోకుండానే ఆపరేషన్ ఆకర్ష్ ని కూటమి పెద్దలు చేస్తరా అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక వైసీపీ అవిశ్వాస సమావేశాన్ని బాయ్ కాట్ చేయడం కూడా వ్యూహాత్మక తప్పిదంగానే చూస్తున్నారు. సమావేశానికి వెళ్ళి తమ వాదన వినిపించి అప్పుడు అక్కడే రాజీనామా చేసినా హుందాగా ఉండేది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే జీవీఎంసీ ఎన్నికల్లో 58 మందితో గెలిచిన వైసీపీ ఈ రోజున ఎంతమందిని తన వైపునకు ఉంచుకుంది అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ధీటైన నాయకత్వం సరైన వ్యూహాలను అనుసరించినట్లు అయితే ఓటమిలో అయినా విజయం ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా ముందే ఓటమికి రెడీ అయిపోవడం అంటే వైసీపీది పేలవమైన రాజకీయ ప్రదర్శనగానే అంతా చూస్తున్నారు.

విశాఖ అసలే టీడీపీకి కంచుకోట. అలాంటి చోట జనసేన జత కలసింది. బీజేపీ తోడు అయింది. దాంతో మరింత బలంగా ఉంది. ఈ సమయంలో ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి నాయకత్వం లేమి అయితే స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. మేయర్ మీద అవిశ్వాసం తరువాత అయినా వైసీపీ పెద్దలు విశాఖ మీద ఫోకస్ పెడతారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.