ఇదేంటి సర్...వైసీపీలో భయాలు!
ఇది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం అని ఆయన అంటూ ఈ విషయంలో అనేక లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ఈసీ మీద ఉందని అన్నారు.
By: Satya P | 12 July 2026 9:15 AM ISTసర్ పేరుతో ఏపీలో ఓటర్ల సమగ్ర జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతోంది. జూన్ 15 నుంచి మొదలైన ఈ కార్యక్రమం జూలై 14తో ముగుస్తోంది. అంటే కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అన్న మాట. సర్ ప్రక్రియ ఏపీలో ఎలా జరుగుతోంది అంటే టీడీపీ నుంచి పెద్దగా ఫిర్యాదులు లేవు, జనసేన నుంచి కూడా లేదు, బీజేపీ కూడా విమర్శలు చేయడం లేదు. వైసీపీ మాత్రం అనేక సందేహాలను వ్యక్తం చేస్తోంది. అలాగే భయాలను కూడా వ్యక్తం చేస్తోంది. ఏపీలో సర్ ప్రక్రియ అంతా లోపభూయిష్టంగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అధికార టీడీపీ తన రాజకీయ లబ్దికి సర్ ని వాడుకుంటోంది అని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విమర్శిస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం అని ఆయన అంటూ ఈ విషయంలో అనేక లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ఈసీ మీద ఉందని అన్నారు.
ప్రక్రియ మొత్తం మీదనే :
వైసీపీ ఏకంగా సర్ మొత్తం ప్రక్రియ మీదనే విమర్శలు గుప్పిస్తోంది. ఓటర్లకు అందచేయాల్సిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీకి సంబంధించి కానీ ఫారాలు తీసుకోవడంలో కానీ వాటిని పూర్తి చేయడంలో కానీ ఎక్కడ చూసినా సవ్యంగా సాగడం లేదని అంతా లోపభూయిష్టంగానే సాగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని అంటోంది. దొంగ ఓట్లు తొలగించాలని అలాగే డూప్లికేట్ ఓట్లు తొలగించాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది.
వైసీపీ ఓట్లే టార్గెట్ :
ఇక వైసీపీ మరో ఆరోపణ ఏమిటి అంటే వైసీపీ ఓట్లనే టార్గెట్ గా చేసుకుని తొలగిస్తున్నారు అని. తమ వారికి వైసీపీ సానుభూతిపరులకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం లేదని విమర్శిస్తోంది. ఇక ఎవరికీ పూర్తిగా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోయినా 99 శాతం పూర్తి అయినట్లుగా ఎలా చెబుతారు అని వైసీపీ అంటోంది. మొత్తం మీద వైసీపీ విషయం తీసుకుంటే సర్ ప్రక్రియ ద్వారా తాము రాజకీయంగా నష్టపోతున్నామని అంటోంది.
ఓటర్లలో చైతన్యం :
ఇదిలా ఉంటే ఓటు అన్నది ప్రతీ వారి హక్కు. ఓటర్లలో చైతన్యం కూడా ఉండాలి. తమ ఎన్యుమరేషన్ ఫారాల కోసం వారు దగ్గరలోని సచివాలయాలకు వెళ్ళి వాకబు చేయాల్సి ఉంది. వైసీపీ అయితే సర్ ప్రక్రియ మీద వర్క్ షాప్ లని నిర్వహించింది. అలాగే ప్రతీ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది. మరి వైసీపీ నేతలు గ్రౌండ్ లెవెల్ లో ఆ దిశగా పనిచేస్తున్నారా అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. పార్టీ సైతం ఈ విషయం మీద మోనిటరింగ్ ఈ నెల రోజులలో పెద్దగా చేసినది లేదని అంటున్నారు. విమర్శలు ఆరోపణలే కాకుండా యాక్షన్ లోకి దిగి తమ ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీగా వైసీపీ మీద కూడా ఉంది కదా అంటున్నారు.
అదే నినాదాన్ని వైసీపీ కూడా :
మరి వైసీపీ సత్తా ఏమిటి అన్నది 21న వెలువడే సర్ ఓటర్ల ముసాయిదా జాబితాలో తెలుస్తుంది అని అంటున్నారు. టీడీపీ అయితే ఇక్కడ కీలకంగా ఉంది. సహజంగా అధికార పార్టీ కావడం వల్ల కూడా టీడీపీకి ఈ విషయంలో వెసులుబాటు ఉందని అంటున్నారు. వైసీపీ మాత్రం అధికార పార్టీ మీద విమర్శలకు పరిమితం కాకుండా సర్ ప్రక్రియ ద్వారా తాము చేయాల్సినది చేసింది ఏ మేరకు అన్నది కూడా ప్రశ్నలుగా ఉన్నాయి. ఏది ఏమైనా సర్ ప్రక్రియతో ఓట్లు విపక్షాలవి పోతున్నాయని అంటున్నారు. అదే నినాదాన్ని వైసీపీ కూడా ఎత్తుకుందా నిజంగా వైసీపీవి సందేహాలా లేక భయాలా ఏమిటి అన్నవి ముసాయిదా జాబితా చూస్తేనే తప్ప తెలియదు అని అంటున్నారు.
