వార్డుల నుంచి సర్ వరకు.. వైసీపీ లో గుబులు.. !
రాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వార్డులను ఏర్పాటు చేయడం.
By: Garuda Media | 29 May 2026 1:00 PM ISTరాష్ట్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వార్డులను ఏర్పాటు చేయడం. రెండోది స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ (సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను నవీకరించడం. ఈ రెండు అంశాలు అత్యంత కీలకంగా మారాయి. పార్టీలకు, రాజకీయ నేతలకు కూడా ఈ రెండు అంశాలు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. మరో రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో వార్డుల విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో వార్డుల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో అధికారులు ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అయితే వైసిపి తరఫున ఈ వ్యవహారం పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. నెల్లూరు, కర్నూలు, కడప, విశాఖపట్నం, అనంతపురం సహా పలు ఉమ్మడి జిల్లాల్లో వార్డుల విభజన పేరుతో తమ ఓటు బ్యాంకును పోగొడుతున్నారన్న వాదన వైసీపీలో వినిపిస్తోంది.
వార్డులను విభజించడం ద్వారా తమ ఓటు బ్యాంకును నష్టపరిచే ప్రక్రియ సాగుతోందని ఇటీవల మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోనూ ఇదే తరహాలో నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని పారదర్శకంగానే చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సర్ ప్రక్రియ వచ్చే నెల 16 నుంచి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. దీనిపై కూడా వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది.
సాక్షాత్తు జగనే సర్ ప్రక్రియ విషయంపై వివరణ ఇస్తూ పలు రాష్ట్రాలను ఉదహరించారు. అక్కడ ఓటు బ్యాంకు తగ్గడం కారణంగానే అధికారం కోల్పోయారనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. వాస్తవానికి సర్ ప్రక్రియపై ఇతర రాజకీయ పార్టీలకు కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ వైసీపీలో మాత్రం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మరి దీనిని ఏ విధంగా చూస్తారు.. నిజంగానే ఓటు బ్యాంకు తగ్గిపోతుందా అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు వార్డు విభజనను గాని ఇటు సర్ ప్రక్రియను కానీ భౌతికంగా అడ్డుకునే పరిస్థితి అయితే లేదు. అవి కొనసాగుతాయి. కాబట్టి నాయకులు రంగంలోకి దిగి వారి వారి ఓటు బ్యాంకు ను కాపాడుకునే దిశగా అడుగులు వేయాలి. కానీ ఈ తరహా ప్రయత్నాలు వైసీపీలో జరగకపోవడంతో అధిష్టానానికి గుబులు పట్టుకుంది.
