వైసీపీ లోపాలు ఇవే.. సరిదిద్దుకోలేరా ..!
వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. దీనికి సంబంధించిన ప్రణాళిక ఉందా? అసలు లోపాలను గుర్తిస్తున్నారా? అనేది ఇప్పుడు ప్రశ్న
By: Tupaki Desk | 20 Jun 2025 5:00 AM ISTవైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. దీనికి సంబంధించిన ప్రణాళిక ఉందా? అసలు లోపాలను గుర్తిస్తున్నారా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. తాజాగా కూడా .. ఎప్పటి నుంచో పార్టీని పట్టిపీడిస్తున్న లోపాలే మరోసారి వెలుగు చూశాయి. వీటిని సరిచేసుకోకుండా.. పార్టీ పుంజుకుంటుందా? అనేది ప్రశ్న. ఏపార్టీకైనా కార్యకర్తలు ముఖ్యం. అదేసమయంలో నాయకగణానికి ఒక పద్ధతి ముఖ్యం. ఈ రెండు విషయాల్లో కార్యకర్తలు ఉన్నా.. నాయకగణానికి ఒక పద్ధతి లేకపోవడంతో వైసీపీ కుంటి పరుగు పెడుతోందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
ఇవీ ఇతమిత్థంగా వైసీపీ లోపాలు...
1) స్క్రిప్టు చూసి చదువుడు: ఇది జగన్ కు ఎలా అబ్బిందో తెలియదు కానీ.. ఆయన 2019 నుంచి స్క్రిప్టు చూసి చదువుతున్నారు. అంతకుముందు.. ఆయన స్పష్టంగా తన ప్రసంగం చేసేవారు. దీనిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీనివల్ల మెజారిటీ మేధావి వర్గం జగన్‌తో కనెక్ట్ కాదు. అంతేకాదు.. మధ్యతరగతి వర్గంలోనూ ఏవగింపు కలుగుతుంది. దీనిని తక్షణమే సరిచేసుకోవాలి.
2) కార్యకర్తలను సరైన విధంగా నడిపించడం: ఇది అత్యంత కీలకం. తాజాగా జరిగిన పల్నాడు పర్యటనలోనూ.. కార్యకర్తలు విజృంభించారు. చెలరేగారు. బలమైన కార్యకర్తలను అదుపులో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని సరైన దిశగా నడిపిస్తే.. పార్టీకి మేలు జరుగుతుంది.
3) గతంలో చేసిన మంచిని ప్రచారం చేసుకోకపోవడం: ఇది అసలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారానికి వైసీపీ బలమైన కౌంటర్ ఇవ్వడం లేదు. అటు నుంచి ఒక విమర్శ వస్తే.. ఇటు నుంచి రెండు తూటాలు పేలాలి. బలమైన వ్యక్తులు రంగంలోకి దిగాలి. ఇది 2019కి ముందు ఉంది. కానీ.. ఇప్పుడు కనిపించడం లేదు. దీనిని జగనే సరిచేయాలి.
4) నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం: పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. కానీ, వారికి ఉన్నది నోరు.. లేనిది ఫ్రీ హ్యాండ్. ఈ విషయంలో టీడీపీ భేష్ అన్నట్టుగా ఉంది. ఎవరు బలంగా మాట్లాడుతున్నారో గుర్తించే వ్యవస్థ ఉంది. వైసీపీలో ఇది లేదు. సో.. దీనిని ఇప్పటికైనా పుంజుకునేలా చేయాలి. తద్వారా నాయకగణం గళం విప్పి పార్టీని పుంజుకునేలా చేసేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేయాలి.
5) బలమైన గళం వినిపించకపోవడం: జగన్ విషయానికి వస్తే.. బలమైన గళం వినిపించి ఎన్ని సంవత్సరాలు అయిందో అనే చర్చ సొంత నేతల నుంచే వినిపిస్తోంది. ఆయన బలమైన విషయాలపై ఫోకస్ చేయాలి. అప్పుడు మాత్రమే పార్టీ పుంజుకుంటుంది. లేకపోతే.. మబ్బుల్లో నీళ్ల మాదిరిగానే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
