Begin typing your search above and press return to search.

మ‌న ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు.. జ‌గ‌న్ ఆరా.. రీజ‌నిన్ ఇదే...!

కానీ. తొలిసారి.. ఎమ్మెల్సీల విష‌యాన్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించడం.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నా రంటూ.. ఆరా తీయ‌డం వంటివి ఆస‌క్తిగా మారింది.

By:  Garuda Media   |   31 Oct 2025 11:00 PM IST
మ‌న ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు.. జ‌గ‌న్ ఆరా.. రీజ‌నిన్ ఇదే...!
X

ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా ఎమ్మెల్సీల గురించి ఆరా తీసి న‌ట్టు తెలిసింది. "మ‌నోళ్లు ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు?" అని కీల‌క మాజీ స‌ల‌హాదారు ను అడిగి తెలుసుకున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. అంతేకాదు.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్సీల ప‌నితీరును కూడా తెలుసుకున్న‌ట్టు తెలిసింది. వారు ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు ? అనే విష‌యాల‌పై కీల‌క నేత నుంచి స‌మాచారం తెప్పించుకున్నార‌ని అంటున్నారు.

ఎందుకు..?

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల గురించి మాత్ర‌మే జ‌గ‌న్ అడ‌పా ద‌డ‌పా ప్ర‌శ్నించేవారు. అంత‌కు మించి ఎమ్మెల్సీల‌పై ఆయ‌న ఎప్పుడు దృష్టి పెట్టింది లేదు. వారు ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా కూడా.. పెద్ద‌గా స్పందించేవారు కాదు. ఈ క్ర‌మంలోనే పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొంద‌రు అధికార పార్టీ టీడీపీలో చేర‌గా.. మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీలో చేరారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ వారి గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. క‌నీసం వారికి సంబంధించి అంశాల‌పై ఎప్పుడూ మాట్లాడ‌లేదు.

కానీ. తొలిసారి.. ఎమ్మెల్సీల విష‌యాన్ని జ‌గ‌న్ ప్ర‌స్తావించడం.. ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారంటూ.. ఆరా తీయ‌డం వంటివి ఆస‌క్తిగా మారింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మండ‌లిలో వైసీపీ బ‌లాన్ని త‌గ్గించే విధంగా రాజ‌కీయ వ్యూహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. వైసీపీ ప్ర‌స్తుతం మండ‌లిలో పైచేయిగా ఉంది. ప్ర‌భుత్వానికి ఇక్క‌డే ఇబ్బంది వ‌స్తున్న విష‌యం తెలిసిందే. టీడీపీ నేత చంద్ర‌య్య కుమారుడికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇచ్చే బిల్లుకు కూడా ఇక్క‌డే అడ్డుక‌ట్ట ప‌డింది.

అలానే.. ఇత‌ర అంశాల‌పై కూడా వైసీపీ ఇక్క‌డే పోరాటం చేస్తోంది. దీంతో భ‌విష్య‌త్తులో తీసుకువ‌చ్చే ప‌లు బిల్లుల‌కు వైసీపీ అడ్డు క‌ట్ట వేయ‌కుండా.. మండ‌లిలో పైచేయి సాధించాల‌న్న‌ది టీడీపీ వ్యూహం. రాజ‌కీయంగా ఇలాంటివి కామ‌నే. అయితే.. ప్ర‌స్తుతం అసెంబ్లీలో ఎలానూ బ‌లం లేనందున‌.. మండ‌లిలో కూడా బ‌లం పోతే.. ఇక‌, వైసీపీకి గుర్తింపు పెద్ద‌గా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలోనే.. జ‌గ‌న్‌.. త‌మ ఎమ్మెల్సీల విష‌యాన్ని ఆరా తీశార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వారిని ఆప‌ని సంస్కృతి కొన‌సాగుతున్న వైసీపీలో ఇప్పుడు ఇలా చ‌ర్చించ‌డం.. ఆరా తీయ‌డం ఆస‌క్తిగా మారింది.