Begin typing your search above and press return to search.

నాడు విశాఖ నేడు మావిగన్...ఇదేంటి జగన్ ?

ఒక రాజకీయ పార్టీకి అందునా అధికారంలోకి వచ్చి అయిదేళ్ళు పాలించిన పార్టీకి రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది.

By:  Satya P   |   3 April 2026 12:14 PM IST
నాడు విశాఖ నేడు మావిగన్...ఇదేంటి జగన్ ?
X

ఒక రాజకీయ పార్టీకి అందునా అధికారంలోకి వచ్చి అయిదేళ్ళు పాలించిన పార్టీకి రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఆ పార్టీలో నేతలు ఏవరైనా ఏదైనా తడబాటు పొరపాటూ మాట్లాడితే అది వేరే సంగతి, కానీ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రాజధాని వంటి ఒక సెంటిమెంట్ అంశం మీద మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం రాజధాని విషయంలో మాట్లాడుతున్న తీరు మీద అయితే అంతటా చర్చ సాగుతోంది. ఒక పార్టీగా ఏపీ రాజధాని విషయంలో వైసీపీకి ఉండాల్సిన సీరియస్ నెస్ లేదా అన్నదే అంతటా ఆలోచిస్తున్న విషయం.

విశాఖ అంటూ :

ఏపీకి రెడీ మేడ్ రాజధాని గా విశాఖ ఉందని వైసీపీ అధికారంలో ఉన్నపుడు తెగ ఊదరగొట్టింది. ఇంతకంటే బెస్ట్ కాపిటల్ ఎక్కడా లేదని కూడా ఒకటికి పదిసార్లు చెప్పుకొచ్చింది. విశాఖకు సీ ఎయిర్, రోడ్ రైల్ కనెక్టివిటీ ఉన్నాయని కూడా వైసీపీ నేతలు గొప్పగా చెప్పారు. ఎక్కడైతే సముద్రం ఉంటుందో ఆ తీర ప్రాంత నగరం విశేషంగా అభివృద్ధి చెందుతుందని ముంబై చెన్నై వంటి ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. తీరా చూస్తే విశాఖ రాజధానిగా వైసీపీ ఒక్క అడుగు కూడా వేయకుండా పవర్ నుంచి దిగిపోయింది.

మావిగన్ పేరుతో :

ఇపుడు చూస్తే మావిగన్ అంటూ కొత్త పేరుతో వైసీపీ ముందుకు రావడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మహా నగరం చేయమని జగన్ ప్రతిపాదన. మరి అదే ప్రతిపాదన ఆయన అధికారంలో ఉన్నపుడు చేసి ఆ మూడు ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రత్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. తన చేతిలో అధికారం ఉండగా ఈ తరహా ఆలోచన చేయకుండా మూడు రాజధానులు అంటూ దేశంలో ఎక్కడా లేని విధానాన్ని తీసుకుని వచ్చి వైసీపీ ఎంతగా అభాసుపాలు అయిందో తెలుసు కదా అని అంతా అంటున్నారు. ఇక మూడు రాజధానుల విషయం మీదనే జనాలు ఆగ్రహంగా ఉంటూ 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించారు అని చెబుతున్నారు.

మళ్ళీ మూడుతోనే :

దాంతో విశాఖ అంటూ నిన్నటి దాకా వైసీపీ కురిపించిన ప్రేమ హఠాత్తుగా మాయమైపోయి మావిగన్ అని కొత్త పేరుని ప్రచారంలోకి తీసుకుని వచ్చారని అంటున్నారు. అంటే మళ్లీ మూడు తోనే వైసీపీ తన కొత్త రాజకీయం స్టార్ట్ చేసిందని టీడీపీ విమర్శిస్తోంది. మూడు ప్రాంతాలు పోయి ఇపుడు మూడు నగరాలు వచ్చాయి. ఈ విధంగా ఎన్ని సార్లు మారుస్తారు, ఎన్ని సార్లు రాజధాని విషయంలో నిర్ణయాలు చేస్తూ పోతారు అన్నదే ప్రత్యర్ధుల ప్రశ్న. జనాలు సైతం ఈ తరహా ప్రకటనలను సీరియస్ గా ఎందుకు తీసుకుంటారు అని కూడా అంటున్నారు.

అమరావతి అనలేరా :

చంద్రబాబు అయితే వైసీపీ తీరు మీద తీవ్ర విమర్శలే గుప్పించారు. అమరావతి అన్నది జగన్ నోట రావడానికే ఇష్టం లేదని అందుకే మావిగన్ అంటూ కొత్త పేరు తెచ్చారని మండిపడ్డారు. ఇక రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ వైసీపీ మరీ ఇంతలా గందరగోళంలో పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇపుడు మావిగన్ అంటే ఆ మూడు నగరాల నుంచి కొత్తగా పెరిగే మైలేజ్ ఏమీ ఉండదని, విశాఖను నాడు ముద్దు నేడు వద్దు అన్నా అక్కడ జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయిందని అంటున్నారు. వైసీపీ ఏపీ రాజధాని విషయంలో అవలంబిస్తున్న నిలకడలేని తనంతో ఆ పార్టీ అన్ని ప్రాంతాల ప్రజలకు దూరం అయ్యేలా చేసుకుంటోంది అన్న చర్చ కూడా సాగుతోంది.