వైసీపీ 2.0 లో పాలించేది వారేనా ?
వైసీపీ పాలన ఏమిటి అన్నది ఒకసారి చూశారు. అయిదేళ్ళ పాటు జగన్ అధికారంలో ఉన్నారు. వైసీపీ ప్రాధాన్యతలు ఏమిటి అన్నది కూడా అటు సగటు ప్రజలకు ఇటు పార్టీ క్యాడర్ కి కూడా పూర్తిగా అర్ధం అయింది.
By: Satya P | 24 Sept 2025 10:00 PM ISTవైసీపీ పాలన ఏమిటి అన్నది ఒకసారి చూశారు. అయిదేళ్ళ పాటు జగన్ అధికారంలో ఉన్నారు. వైసీపీ ప్రాధాన్యతలు ఏమిటి అన్నది కూడా అటు సగటు ప్రజలకు ఇటు పార్టీ క్యాడర్ కి కూడా పూర్తిగా అర్ధం అయింది. వైసీపీ ఫోకస్ ఎక్కువగా సంక్షేమం మీదనే పెట్టింది అలాగే వైసీపీ క్యాడర్ కంటే కూడా వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకుంది. వారే మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని భావించింది. అయితే వైసీపీ ఆశలు నమ్మకాలూ 2024 ఎన్నికల్లో పూర్తిగా వమ్ము అయిపోయాయి. ఎన్నడూ లేని విధంగా వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయింది. దాంతో వైసీపీలో అంతర్మధనం మొదలైంది. ఇపుడు పార్టీ నెమ్మదిగా రిపేర్లు మొదలెట్టింది.
అంతా మీవల్లే అంటూ :
వైసీపీ 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా అయిదేళ్ళ పాలన తరువాత యాంటీ ఇంకెంబెన్సీ ఉన్నా కూడా 40 శాతం ఓట్ షేర్ ని సాధించింది. ఈ ఘనత అంతా క్యాడర్ దే అని జగన్ వారికి ఇచ్చేశారు. వైసీపీ క్యాడర్ అంతా ఒక ఫ్యామిలీ అని కితాబు ఇచ్చారు. మీరు లేకపోతే వైసీపీ లేదని అన్నారు. గత 14 ఏళ్ళుగా వైసీపీ ఈ విధంగా పటిష్టంగా ఉంది అంటే క్యాడర్ వల్లనే అని జగన్ స్పష్టం చేశారు.
ఐడీ కార్డులు ఇస్తామని :
ఇక వైసీపీ క్యాడర్ కి ప్రస్తుతం పదవుల్లో అవకాశం ఇస్తామని ప్రభుత్వం వచ్చినపుడు అన్ని విధాలుగా వారినే ముందు పెట్టి నడిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకూ తీసుకుని పోవాలని ఆయన కోరారు. అంతే కాదు గ్రామ స్థాయిలో కూడా మహిళ, యువత, విద్యార్ధి, రైతు ఇలా అన్ని అనుబంధ విభాగాలు ఉండాలని ఆయన కోరారు. పార్టీలో కీలక క్యాడర్ కి బాధ్యులకు ఐడీ కార్డులు కూడా ఇస్తామని జగన్ చెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రాస్ రూట్ లెవెల్ వరకూ కూడా పార్టీ నిర్మాణం పకడ్బంధీగా ఉండాలని ఆయన సూచించారు. డిసెంబర్ నెలాఖరులోగా కమిటీల నిర్మాణం అంతా గ్రాస్ రూట్ లెవెల్ దాకా పూర్తి చేయాలని అలా చేయని అసెంబ్లీ ఇంచార్జిలను పదవుల నుంచి తప్పిస్తామని జగన్ హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.
మీరే పాలకులు :
వైసీపీ అధికారంలోకి వస్తే మీరే పాలకులు అని జగన్ క్యాడర్ కి చెప్పారు. మీరు ఎలా చెబితే అలాగే పాలన ఉంటుందని ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నుంచే నడుపుదామని ఆయన చెప్పడం విశేషం. అభివృద్ధి కార్యక్రమాలు అయినా లేక సంక్షేమ కార్యక్రమాలు అయినా క్యాడర్ ని ముందు పెట్టే జరిపిస్తామని జగన్ మరో హామీ ఇచ్చారు. మొత్తానికి క్యాడర్ కే అగ్ర తాంబూఒలం అని జగన్ స్పష్టం చేసినట్లు అయింది అని అంటున్నారు. అదే అధికారంలో ఉన్నపుడే ఈ విధంగా వ్యవహరించి ఉంటే కనుక పార్టీ ఇంత దారుణంగా ఓటమి పాలు అయ్యేది ఉండదు కదా అని అంటున్నారు. మొత్తం మీద వైసీపీ సరైన దారిలోనే వెళ్తోంది అని పార్టీ వాదులు అంటున్నారు. బాటం టూ టాప్ అన్నది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. నిర్ణయాలు సలహాలు అట్టడుగు స్థాయి నుంచి రావాలని పార్టీ బలంగా కోరుకుంటోంది అని అంటున్నారు.
