Begin typing your search above and press return to search.

బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధమా ?

ఈ నేపధ్యంలో ఇపుడు ఏపీలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. దానిని స్టార్ట్ చేసిన వారు వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

By:  Tupaki Desk   |   22 May 2025 9:47 AM IST
బీజేపీతో పొత్తుకు వైసీపీ సిద్ధమా ?
X

ఏపీలో టీడీపీ కూటమి బలంగా ఉంది. ఎంత బలంగా అంటే మరో నాలుగేళ్ల తరువాత ఏపీలో జరిగే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేయాలని ఇప్పటి నుంచే ఒట్టు పెట్టుకుని ముదుకు సాగేటంత బలంగా ఉంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటున్నారు. బాబు సైతం 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అనుభవాలతో బీజేపీ పెద్దల మనసెరిగి నడచుకుంటున్నారు అని చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో ఇపుడు ఏపీలో కొత్త చర్చ స్టార్ట్ అయింది. దానిని స్టార్ట్ చేసిన వారు వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఆయన తాజాగా మాట్లాడుతూ జగన్ తప్పు చేశారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వైసీపీ చేసిన తప్పు అన్నారు. ఈసారి అవకాశం వస్తే పొత్తు పెట్టుకోవాలని సూచిస్తామని అన్నారు.

ఇదిలా ఉంటే దేశంలో బీజేపీ అత్యంత బలంగా ఉంది. మోడీ ప్రజాకర్షణ నేతగా ఉన్నారు. పాక్ తో ఇటీవల జరిగిన పరిమిత స్థాయి దాడులు యుద్ధ వాతావరణం నేపధ్యంలో మోడీ మరింత బలోపేతం అయ్యారు. దేశ ప్రజలు మోడీని అత్యంత శక్తివంతమైన నేతగా చూస్తున్నారు. దాంతో ఈ ఇమేజ్ తో ఆయన మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తారని అంచనాలు ఉన్నాయి.

ఇక వచ్చే ఎన్నికల్లోగా పాక్ తో ఒక మాదిరి యుద్ధం జరిగినా జరగవచ్చు అంటున్నారు. అదే కనుక జరిగితే మోడీ వెంటే దేశమంతా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మోడీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో చూస్తే మళ్ళీ బీజేపీ జనసేన టీడీపీ కూటమికి రాజకీయ వాతావరణం అనుకూలించే చాన్స్ ఉంది అని అంటున్నారు.

దాంతో వైసీపీలో ఒక చర్చ జరుగుతోంది. దాని ఫలితమే నల్లపురెడ్డి తాజా కామెంట్స్ అని అంటున్నారు. బీజేపీతో మొదటి నుంచి స్నేహంగా ఉన్నది వైసీపీయే అని ఆ పార్టీలో వారు అనుకుంటున్నారుట. బీజేపీ పెద్దలు జగన్ తో ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారని చెబుతున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అయితే ఏకంగా ఎన్డీయే ప్రభుత్వంలో చేరమని రెండు మంత్రి పదవులు ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ కూడా ఇస్తామని ఒక దశలో ప్రతిపాదించారని గుర్తు చేస్తున్నారు.

అయితే మైనారిటీలు దళితులు ఇతర వర్గాల ఓటు బ్యాంక్ కి గండి పడుతుందని భావించే జగన్ బీజేపీతో పొత్తులకు దూరంగా ఉన్నారని అంటున్నారు. అయితే జగన్ వ్యూహం అంచనాలు తప్పు అయ్యాయని 2024 ఫలితాలు నిరూపించాయని అంటున్నారు. మైనారిటీలు ఎస్టీలు దళితులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపడంతో చరిత్రలో కనీ వినీ ఎరగని తీరులో కూటమి 164 సీట్లను సాధించింది అని గుర్తు చేస్తున్నారు.

మోడీ ఇమేజ్ ముందు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయని అంటున్నారు. నిజానికి ఎన్డీయే కూటమిలో వైసీపీని చేరమని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి రాందాస్ అతవాలే వంటి వారు కూడా అనేక సార్లు చెప్పారని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ ఆఫర్లు అన్నీ వదిలేసుకుని ఇపుడు దిగాలుగా చూస్తోందని అంటున్నారు. వైసీపీ తటస్థ విధానం ఈ రోజున ఏపీ రాజకీయాల్లో అసలు పనికిరాదు అని ఆ పార్టీలో సీనియర్లు అంటున్నారుట.

టీడీపీ కూటమి బలంగా ఉందని ఒంటరిగా వైసీపీ ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమని అంటున్నారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వైసీపీ వదిలేసుకున్న చాన్స్ ని టీడీపీ ఒడుపుగా పట్టుకుంది. ఇపుడు కూటమి మిత్రులు హ్యాపీగా ఉంటున్నారు. ఈ మధ్యలోకి వైసీపీ ఎలా ప్రవేశించగలదు అన్నదే చర్చగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి వైసీపీకి చాన్స్ ఇచ్చేలా టీడీపీ వ్యవహరించదు అని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఈ కూటమి కలసికట్టుగా ఉండేందుకు ఏమి చేయాలో అన్నీ చేస్తారని అంటున్నారు. దాంతో బీజేపీ కూడా వైసీపీ వైపు చూసే అవకాశాలు అయితే లేవు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ అధినేత తనదైన విధానాలతో గెలుపు అవకాశాలను తగ్గించుకుంటున్నరు అన్నదే సీనియర్ల వేదనగా ఉంది అంటున్నారు. మరి బీజేపీ వైసీపీల మధ్య ఎప్పటికైనా పొత్తు కుదురుదుందా అధినేత వైఖరి మారినా ఆ చాన్స్ వస్తుందా అంటే కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.