అమరావతి మీద మాట్లాడొద్దు...జగన్ హుకుం ?
అదే సమయంలో అమరావతి రాజధాని విషయంలో తమ స్టాండ్ ఏంటో బయటకు చెప్పకుండానే 2029 ఎన్నికలను ఫేస్ చేయాలన్నది జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 15 Jun 2025 6:00 AM ISTఅమరావతి రాజధాని అన్నది వైసీపీని ఎంతగానో ఇబ్బంది పెట్టింది అని చెప్పాల్సి ఉంటుంది. అమరావతి ప్లేస్ లో మూడు రాజధానులు అని 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్న వైసీపీ తనదైన రాజకీయ విధానాన్ని ఎంచుకుంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమి చెందడం జరిగింది.
అదే సమయంలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. ఈ క్రమంలో వైసీపీ గత ఏడాది విధానపరమైన అంశాలలో పెద్దగా స్పందించడం లేదు. అయితే ఇటీవల వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు అమరావతి రాజధాని విషయంలో తమ విధానం వల్ల కూడా ఓటమి పాలు అయ్యాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఏమైనా మారిందా అన్న చర్చ కూడా ఆ తరువాత మొదలైంది. కానీ అమరావతి విషయంలో వైసీపీ అయితే తన విధానాన్ని అలాగే కొనసాగిస్తోందని జగన్ ఈ మధ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని అంతా అనుకున్నారు. అమరావతి రాజధాని కోసం అయిదారు వందల ఎకరాలు తీసుకుని నిర్మిస్తే సరిపోతుంది కదా అని జగన్ అన్నారు. పైగా గుంటూరు విజయవాడల మధ్యన అని కూడా ప్లేస్ చెప్పారు.
ఇక వైసీపీ తీరు చూస్తే భారీ ఎత్తున లక్షల ఎకరాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అమరావతి రాజధానిని నిర్మించాల్సిన అవసరం లేదన్న భావన ఉందని అంటున్నారు. ఏపీ సమగ్రమైన అభివృద్ధి అన్నదే వైసీపీ విధానం అంటున్నారు. లక్షల కోట్లు ఒకే ప్రాంతం పైన కుమ్మరించడం ద్వారా సంపద సృష్టి జరిగేది ఉండదు సరికదా ప్రాంతీయ వివక్ష వస్తుందని కూడా వైసీపీ భావిస్తోంది అన్నది కూడా అంటున్నారు.
మరో వైపు చూస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం అమరావతి రాజధాని విషయం కాదని అంటున్నారు. అదే నిజమైతే ఉత్తరాంధ్రా రాయలసీమ రీజియన్ లో కూడా వైసీపీకి సీట్లు ఏవీ రాలేదని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఓట్లు పెద్ద ఎత్తున పెరగడం ఈవీఎంల వల్లనే ఓటమి సంభవించింది అని జగన్ భావిస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది.
మరో వైపు చూస్తే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం అమరావతినే పట్టుకుని అక్కడే వేలాది కోట్లను పెట్టడం వల్ల మిగిలిన ప్రాంతాలలో వ్యతిరేకత వస్తోందని వైసీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది అని అంటున్నారు అంతే కాదు అమరావతి కోసం అంటూ ఇప్పటికే 33 వేల ఎకరాలను తీసుకున్నారని దానిని ముందు ఒక లెక్కకు తీసుకుని రాకుండా ఇంకా మరో 44 వేల ఎకరాలను సేకరించడం వంటివి మంచి నిర్ణయం కాదని భావనలో ఉన్నారని చెబుతున్నారు.
ఇక చంద్రబాబు అండ్ కో చెబుతున్నట్లుగా అమరావతి రాజధాని అన్నది కేవలం నాలుగేళ్ళలో పూర్తి అయ్యేది కాదని అందువల్ల 2029 నాటికి కూడా అది అలాగే ఉండే చాన్స్ ఉందని కూడా ఆలోచిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. దాంతో అమరావతి రాజధాని విషయంలో కూటమి తీసుకున్న నిర్ణయాలను రానున్న కాలమంతా పరిశీలించడమే కాకుండా వాటి మీద జనంలో వచ్చే రియాక్షన్స్ ని గమనిస్తూ ముందుకు సాగాలన్నదే వైసీపీ రాజకీయ విధానం అని అంటున్నారు.
అదే సమయంలో అమరావతి రాజధాని విషయంలో తమ స్టాండ్ ఏంటో బయటకు చెప్పకుండానే 2029 ఎన్నికలను ఫేస్ చేయాలన్నది జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే అమరావతి విషయంలో ఎవరూ బయటకు మాట్లాడవద్దు అన్నది ఆయన ఆదేశించారని ప్రచారం అయితే సాగుతోంది. ఇక అవసరమైనపుడు సరైన సమయంలో పార్టీ స్టాండ్ ఏంటి అన్నది తాను మాత్రమే ప్రకటిస్తాను అని పార్టీ నేతల వద్ద జగన్ అన్నట్లుగా చెబుతున్నారని ప్రచారం సాగుతోంది.
మరో వైపు ఏంటి అంటే వైసీపీది వికేంద్రీకరణ విధానమే అని అంటున్నారు. ఏపీ సమగ్ర అభివృద్ధి వెనకబడిన ప్రాంతాలలో కూడా అభివృద్ధి అన్నదే పార్టీ స్టాండ్ అని అంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడవద్దు అని పార్టీ హుకుం జారీ చేసింది అని అంటున్నారు.