జగన్ అమరావతి ఊసు ఎత్తరా ?
అమరావతి రాజధాని విషయంలో జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ నే వైసీపీ ఎపుడు అయినా కీలకంగా తీసుకుంటుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 17 April 2025 10:10 PM ISTవైసీపీ అధినేత అయిదేళ్ళ పాటు ఏపీని పాలించిన వారు అయిన మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతి రాజధాని ఊసు ఎత్తరా అన్న చర్చ వస్తోంది. అమరావతి రాజధాని విషయంలో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే అమరావతి రాజధాని మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆయన టీడీపీకి చెందిన మాజీ ఎంపీ అయి ఉండి కూడా అమరావతి రాజధాని విస్తరణ విషయంలో ఇపుడు కొత్త ఆలోచనలు చేయడం మంచిది కాదని అన్నారు.
ముందు 34 వేల ఎకరాల గురించి ఆలోచన చేయమని సలహా ఇచ్చారు. మరో వైపు మేధావులు వివిధ రంగాల ప్రముఖులు కూడా అమరావతి రాజధానికి ఓకే అంటున్నా విస్తరణ పేరుతో కొత్తగా 44 వేల ఎకరాలను ఈ సమయంలో సేకరించాలనుకోవడం అంత మంచిది కాదనే అంటున్నారు. మరి ఏపీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం నిన్నటి దాకా రాజ్యం చేసిన వైసీపీ తన స్టాండ్ ఈ విషయంలో ఏమిటో ఈ రోజు దాకా చెప్పలేదు.
నిజానికి రాజధాని విస్తరణ అన్నది ఊహాగానాలుగానే ఉంటోంది. అదే విధంగా జరుగుతుంది అని అంటున్న వారూ ఉన్నారు. వైసీపీ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంటోంది. అది వ్యూహాత్మకమని చెబుతున్నారు. అమరావతి రాజధానిని లక్ష కోట్లతో చేపడుతోంది ప్రభుత్వం. ఆ పనులకు సంబంధించి వివిధ ఏజెన్సీల ద్వారా రుణాలు తీసుకుని వస్తున్నారు.
ఈ నేపధ్యంలో కూడా వైసీపీ అమరావతి మీద ఒక్క మాట మాట్లాడటం లేదని గుర్తు చేస్తున్నారు. ఇపుడు కొత్తగా విస్తరణ అంటూ వస్తున్న కధనాల మీద కూడా ఆ పార్టీ సైలెంట్ గానే ఉంటోంది ఇలా ఎందుకు అంటే వైసీపీ మూడు రాజధానుల పేరుతో అయిదేళ్ళ పాటు తన పాలనలో చేసిన ప్రయత్నం విఫలం అయింది. అడుగు ముందుకు కూడా కదలలేదు.
ఇక దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఆ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలలో చవిచూసింది అని అంటున్నారు. వైసీపీ ఓటమికి మూడు రాజధానుల రగడ కూడా ప్రధాన కారణం అన్న భావన ఉంది. దాంతో అమరావతి విషయంలో మాట్లాడడం ఈ సమయంలో మంచిది కాదు అని భావిస్తోంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో తన పని తాను చేసుకుని వెళ్తోంది. అందువల్ల మౌనంగా చూస్తూ ఉండడమే బెటర్ అన్న ఆలోచనతోనే వైసీపీ ఉంది అని అంటున్నారు
అమరావతి రాజధాని విషయంలో జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ నే వైసీపీ ఎపుడు అయినా కీలకంగా తీసుకుంటుంది అని అంటున్నారు. ఏపీకి రాజధాని అంటూ ఉండాలి కానీ అదే సమయంలో రాజధాని పేరుతో మొత్తం అంతా ఒక వైపే చూపు పెట్టడం మీద కూడా జనాలలో అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వైసీపీ గమనిస్తోంది అని అంటున్నారు.
అమరావతి రాజధానిని 34 వేల ఎకరాలలో కూటమి ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతోంది. దానికి ప్రజల నుంచి మద్దతు అయితే ఉండొచ్చు కానీ మరో 44 వేల ఎకరాలు అని కనుక భూ సేకరణ పేరుతో వస్తే కనుక అది సర్కార్ కి ఇబ్బంది అవుతుందని ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు అన్న ఆలోచనలో వైసీపీ ఉంది.
అంతే కాదు అమరావతి మాత్రమే సర్వస్వం ఏపీలో మరే సమస్య లేదు మరే ప్రాంతం అభివృద్ధి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం ప్రజల నుంచే వ్యతిరేకత కచ్చితంగా వస్తుందని వైసీపీ ఊహిస్తోంది అని అంటున్నారు. అలా ప్రజలలో అమరావతి ఇష్యూతో సహా ఏపీలో కూటమి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక వ్యతిరేకత రావాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.
అంతవరకూ మౌనమే నా భాష అని ఊరుకోవడం ఉత్తమమని కూడా ఆలోచిస్తున్నారుట. ఇపుడే జనంలోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసినా ఫలితం ఉండదన్న ఆలోచంతోనే జగన్ కూడా తన జిల్లా పర్యటనలను ఎప్పటికపుడు వాయిదా వేసుకుంటున్నారు అని అంటున్నారు. ప్రజలలో మార్పు వచ్చినపుడు వారికి కూటమి ప్రభుత్వ పోకడల మీద విరక్తి కలిగినపుడు మాత్రమే తాము రంగంలోకి దిగితే భారీ ప్రయోజనం చేకూరుతుందని కూడా అంచనాతో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో ఏమిటో.