ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్స్
కాగా, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై జగన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Political Desk | 27 May 2026 3:29 PM ISTఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పక్కా వ్యూహంతో ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఓట్లు తగ్గడం వల్ల అక్కడి అధికార పార్టీలు ఓడిపోయాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఓట్లు భారీగా పెరగడం వల్ల వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని జగన్ రెడ్డి విశ్లేషించారు. ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరేనంటూ జగన్ వ్యాఖ్యానించారు.
మమతా బెనర్జీ, స్టాలిన్ ఓటమికి అదే కారణం
పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తూ వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలో అధికార పార్టీ ఓటమికి ఓట్ల తొలగింపే ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. తమిళనాడులో దాదాపు 74 లక్షల ఓట్లను తొలగించారు. కానీ స్టాలిన్ పార్టీ ఓడిపోయింది కేవలం 17 లక్షల ఓట్ల తేడాతోనే. దీన్ని బట్టి చూస్తే ఓట్ల తొలగింపు ఎంతటి ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. మన విషయానికి వస్తే, మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం.. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండు ప్రక్రియలూ అత్యంత ప్రమాదకరమైనవి" అని జగన్ పేర్కొన్నారు. అదేవిధంగా బెంగాల్ లో 91 లక్షల ఓట్లు తీసేయగా, టీఎంసీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిందని వెల్లడించారు.
ఊరికి యాభై ఓట్లు తీసేస్తే భారీ నష్టం
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిణామాలను జగన్ గణితాత్మకంగా వివరించారు. ఒక వ్యూహం ప్రకారం వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఒక గ్రామంలో కేవలం 50 ఓట్లను తొలగిస్తే చాలు నియోజకవర్గం మొత్తం మీద చూసుకుంటే దాదాపు 5,000 ఓట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఇది అభ్యర్థుల గెలుపోటములను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే మనమంతా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా, నిరంతరం నిఘా ఉంచాలి’ అని పార్టీ క్యాడర్‌కు సూచించారు.
కుప్పంలో 22 వేల అనుమానాస్పద ఓట్లు!
కాగా, ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై జగన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘కుప్పం నియోజకవర్గ ఓట్ల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ దాదాపు 22 వేల అనుమానాస్పద ఓట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే పేరు ఐదుసార్లు, కొన్ని చోట్ల పదిసార్లు కూడా పునరావృతమైంది. లిస్టులో ఆ పేరు ఎన్నిసార్లు కనిపించినా తండ్రి పేరు లేదా భర్త పేరు మాత్రం ఒకేలా ఉంటోంది. ఇది ముమ్మాటికీ బోగస్ ఓటింగే’ అని జగన్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఓట్ల జాబితా తయారీ విధానాన్ని తప్పుబడుతూ, ‘ఏపీలో ఓట్ల జాబితా అనేది ఒక హిస్టరీ అండ్ మిస్టరీగా మారింది’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి తప్పుడు ఓట్లు, బోగస్ ఓట్లపై పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని, ప్రతి ఒక్క ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం బోగస్ ఓట్ల తొలగింపునకు, అర్హులైన వారి ఓట్లు పోకుండా కాపాడుకోవడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు జగన్ రెడ్డి హితబోధ చేశారు.
