‘వ్యూహం’ మార్చుకుంటున్న వైసీపీ?
2029 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న విపక్ష వైసీపీ ‘సరికొత్త వ్యూహం’తో ముందుకు వస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 13 July 2026 3:37 PM IST2029 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న విపక్ష వైసీపీ ‘సరికొత్త వ్యూహం’తో ముందుకు వస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. కూటమిలోని మూడు పార్టీలు మళ్లీ కలిసికట్టుగా పోటీ అంటుండటంతో తమ గెలుపునకు సరైన వ్యూహం అవసరమని వైసీపీ గుర్తించిందని చెబుతున్నారు. దీంతో కొత్త రాజకీయ ఎత్తుగడతో ప్రజల ముందుకు రావాలనే ఆలోచనకు ఆ పార్టీ అధిష్టానం వచ్చిందని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీకి ఇప్పటివరకు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ‘ఐ-ప్యాక్’ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐ ప్యాక్ స్థానంలో తమిళనాడులోని టీవీకే పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహును వ్యూహకర్తగా నియమించుకోవాలని వైసీపీ భావిస్తోందని చెబుతున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సన్నాహాలు మొదలుపెట్టినట్లేనని అంటున్నారు.
రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం అనేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రధానమైనది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాదయాత్ర ఒకటి అయితే, రెండోది పార్టీకి సరైన ఎన్నికల వ్యూహాలు అందించే బృందంగా భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ.. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బృందంలోని రిషిరాజ్ సింగ్ వ్యూహాలతో బోల్తా కొట్టింది. అయితే ఈ సారి తమిళనాడులో టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కపిల్ సాహు వైపు చూస్తోందని కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది.
ప్రశాంత్ కిషోర్ బృందానికే చెందిన కపిల్ సాహు ప్రస్తుతం సొంతంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా డిజిటల్ ప్రచారంలో కపిల్ సాహుకు మంచి గుర్తింపు ఉందని చెబుతున్నారు. తమిళనాడులో టీవీకే పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించిన కపిల్ సాహు సైలెంట్ గా టార్గెట్ ను కొట్టడమే హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికలకు ముందు ఎటువంటి అంచనాలు లేని టీవీకేని ఏకంగా ప్రభుత్వంలోకి తీసుకురావడానికి కపిల్ సాహు వ్యూహాలు బాగా పనికొచ్చాయని చెబుతున్నారు. రెండు బలమైన ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపించి టీవీకేను ఓటర్లకు చేరువ చేయడంలో కపిల్ సాహు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇదే అంశం వైసీపీని ఆకర్షిస్తోందని అంటున్నారు.
కూటమి పార్టీలు కలిసి వుంటే ఓట్లు చీలడం కష్టమనే అభిప్రాయంతో ఉన్న వైసీపీ.. కూటమికి విరుగుడుగా వ్యూహాలు రచించే సరైన స్ట్రాటజిస్టు కోసం అన్వేషిస్తున్న క్రమంలో కపిల్ సాహు పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. దీంతో ఆయనతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. కపిల్ సాహుతో ఒప్పందం కుదిరితే రిషిరాజ్ సింగ్ కు చెందిన ఐ-ప్యాక్ స్థానంలో కపిల్ సాహు సెల్ఫ్-ఎంప్లాయిడ్ బృందం తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్తలపైనే ఆధారపడాలా? అన్న ప్రశ్న పార్టీలో విస్తృతంగా వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి మరమ్మతులు చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదనే వాదన బలంగానే వ్యక్తమవుతోందని చెబుతున్నారు.
