అందుకే బాబుని నమ్మారు...జగన్ సంచలన వ్యాఖ్యలు !
వైసీపీ ఎన్నికల్లో ఓటమి చెంది పది నెలలు పై దాటినా ఇంకా ఎందుకు ఓడిపోయామన్న దాని మీద క్లారిటీ అయితే లేకుండా ఉందా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 10 April 2025 9:42 AMవైసీపీ ఎన్నికల్లో ఓటమి చెంది పది నెలలు పై దాటినా ఇంకా ఎందుకు ఓడిపోయామన్న దాని మీద క్లారిటీ అయితే లేకుండా ఉందా అన్న చర్చ సాగుతోంది. సాధారణంగా అయిదేళ్ళు పాలించిన పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. ఇక వైసీపీ వైపు చూస్తే అన్ని పార్టీలూ ఏకం అయ్యాయి. దానికి తోడు వైసీపీ ఎన్నికలకు చాలా కాలం ముందే డీమోరలైజ్ అయింది.
పార్టీలో లీడర్ కి క్యాడర్ కి మధ్య కో ఆర్డినేషన్ లేకుండా పోయింది. అభివృద్ధి సంక్షేమం రెండూ బాలెన్స్ చేసుకోవాల్సిన చోట సంక్షేమానికే పెద్ద పీట వేశారు. ఇక విపక్షం చేసే విమర్శలకు తగిన విధంగా ఎవరూ జవాబు ఇవ్వలేకపోయారు.
ఈ రోజున జగన్ తమ ప్రభుత్వంలో ఏమి చేశామో మీడియా ముందు చెబుతున్నారు. అదే ముఖ్యమంత్రిగా నెలకు ఒక ప్రెస్ మీట్ పెట్టినా జనాలకు క్లారిటీ వచ్చేది. అలాగే ఢిల్లీ వెళ్ళిన ప్రతీ సారీ ప్రెస్ రిలీజ్ చేసి వదిలేసేవారు. అలా కాకుండా మీడియా మీటింగ్ పెట్టి చెప్పాల్సింది చెప్పి ఉంటే జనాలకు తెలిసి వచ్చేది.
ఇలా అనేక లోపాలు ఉన్నాయి. పైగా ఫైర్ బ్రాండ్స్ పేరుతో కొందరు వైసీపీలో అతి చేసి దెబ్బతీశారు. మూడు రాజధానుల ప్రయోగం విఫలం అయింది. ఏపీ విజన్ మీద వైసీపీ స్పష్టమైన ప్రణాళిక ముందు ఉంచలేకపోయింది. ఇలా అనేక రకాలైన కారణాల వల్లనే వైసీపీ ఓటమి పాలు అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
అయితే జగన్ మాత్రం తాము ఎన్నో మంచి పనులు చేసి కూడా ఓటమి పాలు అయ్యామని అంటున్నారు. తమ కంటే కూడా మరిన్ని పధకాలు ఇస్తామని చంద్రబాబు ఇంటింటికీ తన కార్యకర్తలను పంపించి జనాలను ఆకర్షించగలిగారు అని జగన్ అంటున్నారు. ఉమ్మడి కర్నూల్ జిల్లా వైసీపీ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆయన తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబుని జనం బాగా నమ్మారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అంటే ఎక్కువ చేస్తారు అన్నదే ఆ నమ్మకం అని అన్నారు. పైగా బాబు మారారని కూడా ప్రజలు నమ్మి ఆయనకు ఓటు వేశారని అన్నారు. అందుకే యాభై శాతం ఉన్న వైసీపీ ఓటు షేర్ 40 శాతానికి తగ్గింది అని జగన్ చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు హామీలను నెరవేర్చడంలేదని జగన్ విమర్శించారు.
వైసీపీ ఓడినా మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని కూడా అన్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు గెలుపునకు కారణం వైసీపీ వైఫల్యాలు అని కూడా సరైన ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. వైసీపీ పాలనలో తడబడింది, పాలన కంటే కూడా రాజకీయల మీద ప్రతిపక్షం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మీద కూడా జనాలు విసుగు చెందారు అని అంటున్నారు.
రాజకీయాల్లో ఓటములు సహజమే కానీ అవి ఎందుకు జరిగాయన్నది కనుక సరిగ్గా విశ్లేషించుకుంటేనే గెలుపు ఆశలు మళ్ళీ కనిపిస్తాయి అని అంటున్నారు. ఇక సంక్షేమానికి వైసీపీ తాము బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. హామీలు బాబు అమలు చేయడం లేదని అనవచ్చు కానీ ఇంకా నాలుగేళ్ళ అధికారం కూటమి చేతిలో ఉంది అందువల్ల అపుడు అమలు చేస్తే వైసీపీ వద్ద ఉన్న ఆయుధం పోయినట్లే కదా అని అంటున్నారు.
అభివృద్ధి నమూనా తమది ఏమిటి అన్నది కూడా జనాలకు వైసీపీ ఇప్పటికైనా చెప్పాల్సి ఉందని అంటున్నారు. అలాగే వివిధ వర్గాలు వైసీపీకి దూరం అయ్యాయి, వాటిని తిరిగి ఎలా ఆకట్టుకోవాలో ఆలోచించాల్సి ఉందని అంటున్నారు. బాబుని జనాలు నమ్మారు, ఆ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది అని విమర్శలు చేస్తూ పోతే అది నిజమైన సమీక్ష అనిపించుకోదేమో అన్నదే అసలైన విశ్లేషణ.