11-11-11....కౌంట్ అవుతుందా ?
వైసీపీకి 11 నంబర్ బ్యాడ్ లక్కీ నంబర్ గా మారిపోతోంది. దానిని కూటమి పార్టీల నేతలు సైతం సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు.
By: Satya P | 12 Feb 2026 6:14 PM ISTవైసీపీకి 11 నంబర్ బ్యాడ్ లక్కీ నంబర్ గా మారిపోతోంది. దానిని కూటమి పార్టీల నేతలు సైతం సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ట్రోలింగుల మీద ట్రోలింగులు సాగుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో ఈ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇక తాజాగా బడ్జెట్ సెషన్ కూడా 11వ తేదీన మొదలైతే వైసీపీ ఎమ్మెల్యేలు సభలో అచ్చంగా 11 నిముషాలు మాత్రమే ఉన్నారు అని స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడే కౌంట్ చేసి మరీ చెప్పారు. దీంతో 11-11-11 అని మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
అనర్హత వేటు అంటూ :
ఇక గత ఇరవై నెలలుగా సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. దాంతో వారి పైన అనర్హత వేటు పడుతుందని కూటమి నాయకులు పలు సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. ఇక దాని నుంచి తప్పించుకోవడానికే బడ్జెట్ సెషన్ తొలి రోజుకి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఠంచనుగా హాజరవుతున్నారని కూడా అంటున్నారు. అయితే బడ్జెట్ సెషన్ తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరు అయిన దానిని అటెండెన్స్ గా పరిగణనలోకి తీసుకుంటారా అన్నది ఒక చర్చగా ఉంది. గతసారి కూడా దీని మీద చర్చ సాగింది. స్పీకర్ ఆధ్వర్యంలో జరిగే సభకు హాజరైతేనే హాజరు పడినట్లు లెక్క అని చెబుతున్న వారూ ఉన్నారు
డిజిటిటల్ అటెండెన్స్ లెక్క :
మరో వైపు చూస్తే డిజిటల్ అటెండెన్స్ ని గురువారం నుంచి అసెంబ్లీలో అమలు చేస్తున్నారు. డిజిటల్ అటెండెన్స్ అంటే సభకు హాజరై సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ కౌంట్ అవుతుంది అన్న మాట. అలాగని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఫుల్ అటెండెన్స్ గా అది ఉంటుందా లేదా దానికి ఒక నిర్దిష్ట టైం ఫ్రేమ్ ని సెట్ చేశారా అన్నది కూడా మరో చర్చ. సభ ప్రతీ రోజూ ఉదయం తొమ్మిది నుంచి మొదలై మధ్యాహ్నం రెండు దాకా సాగుతుంది. వీటిని పని గంటలు అంటారు. అంటే అయిదు గంటలు అన్న మాట. ఇందులో కనీసం మూడవ వంతు అయినా సభలో ఉంటేనే డిజిటల్ అటెండెన్స్ కౌంట్ అవుతుంది అని సెట్ చేస్తే మాత్రం కచ్చితంగా గంటన్నర సేపు అయినా సభలో ఉండాల్సి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిముషాలు మాత్రమే సభలో గవర్నర్ స్పీచ్ కి ఉన్నారు, దానిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అన్నది కూడా డిస్కషన్ గా ముందుకు వస్తోంది.
స్పీకర్ విచక్షణ మీదనే :
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా ఉండడంతో పాటు కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే ఒక్క రోజు వస్తున్నారు అన్నది విమర్శగా కూటమి వైపు నుంచి ఉంది. ఈ సమయంలో స్పీకర్ ఆఫీస్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిని బట్టే అనర్హత పడనుందా లేదా అన్నది తేలుతుంది అని అంటున్నారు వైసీపీ వరకూ చూస్తే అరవై పని దినాలలో ఒక్క రోజు అయినా సభకు వస్తే చాలు అని అంటున్నారు. అలా ఒక ఏడాదిలో బడ్జెట్ సెషన్ మొదలు పెడితే వర్షాకాలం శీతాకాలం సమావేశాలు తీసుకున్నా నలభై రోజులకు మించడం లేదు అని గుర్తు చేస్తున్నారు. అందువల్ల బెడ్జెట్ సెషన్ కి ఒక్క రోజు హాజరైనా అనర్హత అన్న ప్రసక్తే ఉండని చెబుతున్నారు. మరి దీని మీద ఏమి జరుగుతుంది ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.
