జస్ట్ ఫర్ జస్టిఫికేషన్...ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా !
వైఎస్సార్ జిల్లాగా ఉన్న దానిని మార్చి వైఎస్సార్ కడప జిల్లాగా మార్చింది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కడపకు చారిత్రాత్మకమైన ప్రాధాన్యత ఇక్కడ ఉంది.
By: Tupaki Desk | 27 May 2025 1:30 AMపాలకులు ధర్మకర్తలుగా ఉండాలని అంటారు. అంతే కాదు రాజధర్మం ఒకటి ఉంటుంది. దానికి ఎవరైనా పాటించాల్సిందే. తన పర తేడా లేకుండా దానిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే వివక్ష ఒకరి మీద చూపారు అన్న నింద పాలకుల మీద రాకుండా ఉండాలనే. ఏపీలో తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
వైఎస్సార్ జిల్లాగా ఉన్న దానిని మార్చి వైఎస్సార్ కడప జిల్లాగా మార్చింది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కడపకు చారిత్రాత్మకమైన ప్రాధాన్యత ఇక్కడ ఉంది. పైగా తిరుపతి దేవుడి గడపగా ముందు పేరు ఉందని అనంతరం వ్యావహారికంలో అది కాస్తా కడపగా మారిందని కూడా చెబుతారు.
ఎంతో విశిష్టమైన చరిత్ర ఉన్న కడప పేరుని తీసేసి వైఎస్సార్ జిల్లాగా ఉంచడం గత వైసీపీ ప్రభుత్వం చేసింది పొరపాటే అని అంతా అన్నారు. దాని మీద గతంలో కూడా విమర్శలు సూచనలు వచ్చాయి. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కడపగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అంతా మెచ్చ తగినది అని అంటున్నారు.
దీని వల్ల వైఎస్సార్ వంటి మహా నేత పేరుకు వచ్చిన ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే వైఎస్సార్ అని జత చేస్తూ కడప అన్నారు. కాబట్టి వైసీపీ వారు బాధపడాల్సింది లేదు. అలాగే వైఎస్సార్ అభిమానులు కూడా కలత చెందాల్సింది లేదు. నిజానికి చూస్తే 2009 సెప్టెంబర్ 3న వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంతో మరణించాక ఆయన పుట్టిన జిల్లాకి పేరు పెట్టాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగానే సవరించి పెట్టింది.
కానీ మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పేరులో కడపను తీసేంది. అలా చారిత్రాత్మక అస్తిత్వం జిల్లా పేరులో మటుమాయం అయింది. అది పూర్తిగా పొరపాటు ఆలోచన అని అంతా అనుకున్నారు. ఇక దాని కంటే ముందు చూస్తే నెల్లూరుకి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారు. అలా అమరజీవి పేరు కలిపినా నెల్లూరు జిల్లా చారిత్రాత్మక ప్రాశస్థానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక ఇపుడు చూస్తే ఏపీలో మరో చారిత్రాత్మకమైన ప్రాంతం ఉంది. అదే విజయవాడ. దానికి పూర్వ నామధేయం విజయవాటిక. స్థల పురాణాలు చూసినా చారిత్రాత్మకమైన విషయాలు తరచి చూసినా విజయవాడకు ఎంతో గొప్పదనం ఉంది. అలాంటి విజయవాడను ఒక జిల్లాగా చేసినపుడు దానికి ఎన్టీఆర్ జిల్లాగా మార్చేశారు. అది కూడా వైసీపీ ప్రభుత్వమే చేసిన నిర్ణయం.
ఇక్కడ ఎన్టీఅర్ పేరు ఆ జిల్లాకి పేరు పెట్టడం తప్పు లేదు. కానీ చారిత్రాత్మకమైన విజయవాడను ఎక్కడా కనిపించనీయకుండా చేయడం పొరపాటు అని అంటున్నారు. అందువల్ల ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా దాని పేరు కూడా సవరించి ఉంటే టీడీపీ కూటమి జస్టిఫికేషన్ ఇచ్చినట్లు అవుతుందని అంతా అంటున్నారు.
ఇక్కడ నాయకులు ఎవరినీ తక్కువ చేయడం కాదు, వారిని గుర్తు చేసుకుంటూనే చరిత్రలో ఉన్న ప్రాంతాలను కూడా మర్చిపోకూడదు అన్నదే అందరి భావన. వైసీపీ చేసిన ఒక తప్పుని సవరించారు. మరో తప్పును కూడా సవరించినపుడే టీడీపీ కూటమి రాజధర్మాన్ని పాటించినట్లు అవుతుందని అంటున్నారు.
లేకపోతే కేవలం వైసీపీ మీద రాజకీయ కక్షతో సంకుచితంగా తీసుకున్న నిర్ణయంగానే అంతా చూస్తారు. నిజానికి చూస్తే ఈ సవరణ మంచి నిర్ణయమే. అదే నిర్ణయం విజయవాడ విషయంలో తీసుకుంటేనే సరైన న్యాయం చేసినట్లు అవుతుంది. లేకపోతే పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కడప జిల్లా అంటూ ఎన్టీఅర్ జిల్లా అని వదిలేస్తే మాత్రం వివక్ష చూపారు అన్నది సగటు జనంలో ఒక భావనగా పాతుకుపోతుంది.
ఇక వైసీపీ కూటమి తీసుకున్న ఈ నిర్ణయం మీద పెద్దగా స్పందించకపోయినా కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనకు ఇది బాధతో కూడిన నిర్ణయం అన్నారు. కానీ పార్టీ పరంగా సమర్ధిస్తున్నాను అన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె చేయడమే కాదు చరిత్రకారులు మేధావుల నుంచి ఇదే డిమాండ్ వస్తోంది.
ఇక మీదట మహనీయుల పేర్లను జిల్లాలకు పెట్టడం అన్న విధానానికి స్వస్తి పలికి చారిత్రాత్మకమైన ప్రాంతాల విశిష్టతను కాపాడాలని కూడా అంతా కోరుతున్నారు. మహనీయుల పేర్లను వేరే విషయాలకు అంశాలు పెట్టాలన్న సూచనలు వస్తున్నాయి.