ఈసీ మీద అభిశంసన...వైసీపీ కి గోల్డెన్ ఛాన్స్
దాంతో అందరి చూపు ఇపుడు వైసీపీ మీదనే ఉంది.ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ పేరుతో ప్రతిపక్ష రాష్ట్రాలలో ఓట్లను లేకుండా ఈసీ చేస్తోంది అన్నది విపక్షాల ఘాటు ఆరోపణ.
By: Satya P | 15 March 2026 12:30 PM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా అభిమానంతో గెలవలేదని ఈవీఎంల సహకారంతో గెలిచిందని తరచూ వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. నిన్నటికి నిన్న ఆ పార్టీ కీలక నేత లక్ష్మీ పార్వతి కూడా మీడియా మీట్ లో ఇదే విషయం చెబుతూ చంద్రబాబుని విమర్శించారు. ఇక గత ఇరవై నెలల కాలంలో అయితే వైసీపీ తమ ఓటమి వెనక ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని పదే పదే ఆరోపిస్తూ వచ్చింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలోనూ కదిపి టాపిక్ గా చేసింది. అంతే కాదు రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేసింది. మరి అలాంటి వైసీపీకి ఇపుడు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు.
విపక్షం ఒక్కటిగా :
అదేంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ మీద ప్రతిపక్షాలు ఉమ్మడిగా అభిశంసన తీర్మానం ఇచ్చాయి. ఆయనను అభిశంసించి వెనక్కి పంపాలన్నది విపక్షాల ఆలోచన. స్పీకర్ మీద అవిశ్వాసం తెచ్చిన విపక్షాలు ఇపుడు ఈసీ మీదనే విపక్షం అభిశంసనకు రెడీ అయింది. లోక్ సభ రాజ్యసభ ఎంపీలు అంతా కలసి 193 మంది దాకా ఈ అభిశంసన తీర్మానం మీద నోటీసు ఇవ్వాలని చూస్తున్నాయి. ఇందులో లోక్ సభ నుంచి 130 మంది, రాజ్యసభ నుంచి 63 మంది ఎంపీలు ఈ అభిశంసన తీర్మానం మీద సంతకాలు చేశాయి.
వైసీపీ మీదనే చూపు :
దాంతో అందరి చూపు ఇపుడు వైసీపీ మీదనే ఉంది.ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ పేరుతో ప్రతిపక్ష రాష్ట్రాలలో ఓట్లను లేకుండా ఈసీ చేస్తోంది అన్నది విపక్షాల ఘాటు ఆరోపణ. అదే విధంగా ఈసీ విపక్షాలను ఇబ్బంది పెడుతోందని కూడా మండిపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈసీ మీద అభిశంసనకు సిద్ధపడుతున్నారు. మరి ఈ విషయంలో ఏపీలో విపక్ష పాత్రంలో ఉన్న వైసీపీ ఏమి చేయబోతోంది అన్నదే చర్చగా ఉంది. వైసీపీ విషయం తీసుకుంటే ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారు అని అంటోంది. అలాగే ఈ మధ్యనే ఏకంగా 51 లక్షల ఓట్లు అదనంగా చేరాయని సాయంత్రం తరువాత అర్ధరాత్రి నుంచి జరిగిన పోలింగ్ లో అధిక శాతం ఓట్లు ఎలా పడ్డాయన్నది కూడా చర్చ ఉంది. వైసీపీ నుంచి కొంతమంది దీని మీద గళం విప్పారు. ఆ విధంగా చూస్తే ఈసీ మీద వైసీపీకి గుర్రు ఉంది. మరి ఇదే సరైన సమయంగా వైసీపీ కూడా ఈసీ మీద అభిశంసన తీర్మానానికి సంతకం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
న్యూట్రల్ అంటూనే :
ఇక వైసీపీ తీరు జాతీయ స్థాయిలో చూస్తే న్యూట్రల్ అంటూనే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి పూర్తి దూరంగా ఉంటోంది. అదే సమయంలో అవసరమైన సందర్భాలలో అధికార ఎన్డీయే బిల్లులకు మద్దతు ఇస్తోంది. మరి అలాంటి సందర్భోచిత సమయాల్లో ఇండియా కూటమి వైపు కూడా మొగ్గు చూపవచ్చు కదా అంటే వైసీపీకి కాంగ్రెస్ తో ఉన్న వైరాన్ని గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇపుడు కాంగ్రెస్ సహా విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం మీద వైసీపీ సంతకం చేసి వారితో కలసి ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా గళం విప్పుతుందా అన్నది పెద్ద చర్చగా ఉంది.
నిబద్ధత చాటుకోవాలంటే :
ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్న వైసీపీ వాదనలోని నిబద్ధత చాటుకోవాలీ అంటే కచ్చితంగా ఈసీ మీద అభిశంసన తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాదని దూరం జరిగితే మాత్రం భవిష్యత్తులో ఇంకెప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడే నైతిక అవకాశాన్ని కోల్పోతుందని అంటున్నారు. అయితే ఇక్కడో చిక్కు ఉంది ఎన్డీయేకు వ్యతిరేకంగా వైసీపీ వెళ్తే భవిష్యత్తులో వచ్చే రాజకీయ ఇబ్బందులు కూడా చర్చకు ఆస్కారం ఇస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే జాతీయ స్థాయిలో వైసీపీ స్టాండ్ అన్నది ఎపుడూ కొంత గందరగోళంగా ఉంటోంది అన్న విమర్శలు ఉంటున్నాయి. అదే సమయంలో ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ తో సహా ఎన్నికల్లో అక్రమాలు ఏవో జరిగాయని సగటు వైసీపీ కార్యకర్త ఈ రోజుకీ బలంగా నమ్ముతున్న వేళ అధినాయకత్వం వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుని క్యాడర్ లో మనో ధైర్యాన్ని నింపుతుందా లేదా అన్నదే అంతా చూస్తున్నారు.
