Begin typing your search above and press return to search.

సీనియర్లకు ఢిలీ దారి చూపుతున్న జగన్...?

చాలా మంది సీనియర్లకు అలా మొండి చేయి చూపించారని భావించకుండా వారికి వేరే విధంగా న్యాయం చేసేందుకు జగన్ సిద్ధపడుతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 12:44 PM GMT
సీనియర్లకు ఢిలీ దారి చూపుతున్న జగన్...?
X

వైసీపీలో ఎవరికీ అన్యాయం చేయను, అందరూ నా వారే, పార్టీ మనకు కుటుంబం లాంటిది అని జగన్ పదే పదే పార్టీ వర్క్ షాపులలో చెబుతూ వచ్చారు. ఇపుడు ఆయన అదే ఆచరణలో అమలు చేయబోతున్నారు. పార్టీలో సీనియర్లకు ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలేదు అని తెలుస్తోంది. చాలా మంది సీనియర్లకు అలా మొండి చేయి చూపించారని భావించకుండా వారికి వేరే విధంగా న్యాయం చేసేందుకు జగన్ సిద్ధపడుతున్నారని అంటున్నారు.

అదేంటి అంటే లోక్ సభకు పోటీ చేయించడం. పార్టీలో సీనియర్లుగా ఉన్న వారు, మంత్రులుగా పనిచేసిన వారిని ఈసారి లోక్ సభకు పోటీ చేయించడం వల్ల రెండిందాలుగా లాభం కలుగుతుందని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. వారి రాజకీయ చాతుర్యం పెద్దరికంతో సులువుగా ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్న లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంటారని ఊహిస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకుంటున్న వారికి కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు అన్నది జగన్ ప్లాన్ అని తెలుస్తోంది.

శ్రీకాకుళం నుంచి మొదలెడితే ఇక్కడ లోక్ సభ సీటుకు స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నూటికి తొంబై శాతం ఆయనే అవుతారు అని అంటున్నారు. ఒక వేళ ఆయన నో అంటే మాత్రం మంత్రి ధర్మాన ప్రసాదరావుకు లోక్ సభకు పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. విజయనగరం ఎంపీ సీటు విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అసలైన ఆప్షన్ అని అంటున్నారు. అవసరం అయితే ఆయన సొంత సీటు చీపురుపల్లిని సతీమణి బొత్స ఝాన్సీరాణికి ఇచ్చి అయినా బొత్సను ఢిల్లీ పంపించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక విశాఖ ఎంపీ సీటు బీసీ నేతకు ఇస్తారని అంటున్నారు. కొత్త ముఖాన్నే ఎంపీగా పంపిస్తారు అని అంటున్నారు. ఎందుకంటే విశాఖ లోక్ సభ పరిధిలో వైసీపీ గెలుచుకున్నది కేవలం మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే. దాంతో టీడీపీని వచ్చి వైసీపీలోకి జంప్ అయిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని ఎంపెగా పంపించాలని చూస్తున్నారు. ఆయన బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో నూరు శాతం ఈ సీటు గెలుస్తామని పార్టీ భావిస్తోంది.

అదే విధంగా అనకాపల్లి ఎంపీ సీటుని భీమిలీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన అవంతి శ్రీనివాసరావుకు ఇస్తారని అంటున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గం డామినేషన్ ఉంది, దాంతో పాటు 2014లో అవంతి టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి ఉన్నారు. ఇక భీమిలీకి కొత్త వారికి చాన్స్ ఇస్తారని లేదా టీడీపీ నుంచి వచ్చే ఒక బిగ్ షాట్ కి కూడా ఆ సీటు కేటాయిస్తారని అంటున్నారు.

అరకు ఎంపీ సీటుని ఎస్టీ మంత్రి పీడిక రాజన్న దొరకు ఇస్తారని తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యే సీటు అయిన సాలూరుకు కొత్త ముఖాన్ని తెస్తారని అంటున్నారు. రాజమండ్రి ఎంపీ సీటుకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు కానీ లేక మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ కానీ పోటీ చేస్తారని అంటున్నారు. అమలాపురం ఎంపీ సీటుకు మంత్రి పినిపే విశ్వరూప్ ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తున్నారు.

కాకినాడ ఎంపీ సీటుని చలమలశెట్టి సునీల్ కి ఇస్తారని, సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం తెచ్చి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. నరసాపురం ఎంపీ టికెట్ విషయానికి వస్తే మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత క్రిష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి ఇస్తారని తెలుస్తోంది. ఆమె కాదంటే గోకరాజు రామరాజు పేరు వినిపిస్తోంది. ఏలూరు ఎంపీ టికెట్ ని కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత అయిన బోళ్ల బుల్లి రామయ్య మనవడు బోళ్ల రాజీవ్ కి ఇస్తారని టాక్ నడుస్తోంది.

నరసారావుపేట సీటుకు రాజ్యసభ ఎంపీ ఆళ్ళ అయోధరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. గుంటూరు విజయవాడలకు ఇద్దరు బిగ్ షాట్స్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. బాపట్ల నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు వినిపిస్తోంది. నెల్లూరు నుంచి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది అని అంటున్నారు.

కర్నూల్ ఎంపీగా టీడీపీ నుంచి వచ్చే ఒక సీనియర్ నేత కుటుంబానికి కేటాయించవచ్చు అంటున్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. కడప ఎంపీ టికెట్ ని మంత్రి అంజాద్ పాషా పేరు వినిపిస్తోంది. హిందూపురం ఎంపీగా ఎమ్మెల్సీ ఇక్బాల్ ని బరిలోకి దింపుతారు అని అంటున్నారు. అనంతపురం ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేరు పరిశీలనలో ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే సీనియర్లను ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నార్.