Begin typing your search above and press return to search.

జగన్ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారా...లేదా...!?

ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్న వేళ ప్రతీ అంశమూ కీలకమే. ప్రతీ వ్యూహామూ అతి ముఖ్యమే

By:  Tupaki Desk   |   7 April 2024 3:50 AM GMT
జగన్ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారా...లేదా...!?
X

ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్న వేళ ప్రతీ అంశమూ కీలకమే. ప్రతీ వ్యూహామూ అతి ముఖ్యమే. ఆ విధంగా చూసుకుంటే అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీకి సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. కొన్ని వర్గాలు తమకు మేలు చేయలేదని ఆవేదనతో ఉంటాయి. వారిని దగ్గరకు తీయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మరికొన్ని వర్గాలు చూస్తే తమకు అరకొర ప్రయోజనాలే దక్కాయని భావిస్తూంటాయి.

వారికి బ్యాలెన్స్ చేయాలి. ఇలా అందరినీ సంతృప్తి పరచేలా చేయడానికి వైసీపీ తనదైన రీతిలో అద్భుతమైన మ్యానివేస్టోని తెస్తుందని ప్రచారం అయితే ఇప్పటిదాకా సాగింది. అందులోని అంశాల మీద కూడా లీకులు వచ్చాయి. ఇవే జగన్ మ్యానిఫేస్టోలో ఉంటాయని కూడా ప్రచారం సాగింది.

తీరా చూస్తే ఇపుడు మరో ప్రచారం సాగుతోంది. ఉగాది వేళ జగన్ ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు ఆ మ్యానిఫెస్టోలో బ్రహ్మాస్త్రం లాంటి రైతు రుణమాఫీ అన్నది ఉండదని అంటున్నారు. దీంతో ఇపుడు ఇది వైరల్ అవుతోంది. ఏపీలో అరవై లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి.

వారికి రుణ మాఫీ అమలు చేస్తే ఆ ఓట్లు అన్నీ గుత్తమొత్తంగా వైసీపీకి పడతాయని ఒక అంచనా ఉంది. కానీ ఈ రుణ మాఫీ మీద వైసీపీలో తర్జన భర్జన సాగుతోందని అంటున్నారు. ఇది ఆర్ధిక భారంగా మారుతుందని అంటున్నారు. రుణ మాఫీ చేస్తే సంపూర్ణంగా చేయాలి. అరకొరగా చేసినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు అది ఎంత అన్నది కూడా లెక్కకు అందడం లేదు అంటున్నారు.

దాంతో ఈ హామీ ఇచ్చి రేపు అధికారంలోకి వస్తే మరుక్షణం అది గుది బండగా మారుతుందని ఆలోచిస్తున్నారు అంటున్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ విషయం కూడా ఉంది. ఈ విషయంలోనూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు అని అంటున్నారు. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాల మహిళలు ఉన్నాయి. ఈ హామీ ఇస్తే వారి ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టినట్లు అవుతుంది. కానీ ఇది కూడా ఆర్ధికంగా భారంగా మారుతుందని ఆలోచిస్తున్నారుట.

అదే విధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ ప్రకటించింది. ఇంకా అనేక ఉచిత హామీలు ఇచ్చింది. దాని మీద ఇటీవల సిద్ధం సభలలో జగన్ మాట్లాడుతూ టీడీపీ ఇచ్చే ఈ తరహా హామీలతో తాము పోటీ పడలేమని తేల్చి చెప్పారు. తాము అన్ని వర్గాలకు మేలు చేస్తామని ఏది చేయగలమో అదే చెబుతామని అన్నారు. దాంతో వైసీపీ మ్యానిఫెస్టోలో భారీ హామీలు అయితే ఉండే అవకాశాలు లేవు అని అంటున్నారు.

రైతులకు ఇపుడు ఇస్తున్న రైతు భరోసా ఆర్ధిక సాయాన్ని మరింతగా పెంచడం. అలాగే డ్వాక్రా మహిళలకు మేలు చేయగలిగే హామీలు ఇవ్వడం తో పాటు వివిధ వర్గాలకు ఏమి చేయగలమో అదే హామీగా ఇవ్వాలని వైసీపీ భావిస్తోందిట. 2019 ఎన్నికల ముందు సంపూర్ణ మద్య పాన నిషేధం ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు వంటి హామీలు ఇచ్చి వైసీపీ అమలు చేయలేక పోయింది.

అలాగే ఏటా మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పినా అది చేయలేదు. ఇలా కొన్ని కీలక హామీలను వైసీపీ చేయలేదు. ఇపుడు మళ్లీ అధికారంలోకి వచ్చినా అలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా తాము చేయగలిగేదే చెప్పాలని చూస్తోందిట. దంతో ఈ నెల 9న ఉగాది వేళ వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల మ్యానిఫేస్టో ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తిని పెంచుతోంది.