Begin typing your search above and press return to search.

అలీ ఔట్‌.. కీలక నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు

By:  Tupaki Desk   |   16 Jan 2024 12:30 PM GMT
అలీ ఔట్‌.. కీలక నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు, ఆర్థిక, అంగ బలాలను బట్టి ఆయన అసెంబ్లీ, లోక్‌ సభా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌ సభా స్థానాలకు సంబంధించి ఒక స్థానాన్ని ఈసారి ముస్లింలకు కేటాయించాలని జగన్‌ నిశ్చయించుకున్నారని టాక్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల లేదా గుంటూరు ఎంపీ స్దానాన్ని ముస్లింలకు ఇవ్వడానికి నిర్ణయించారని సమాచారం.

ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీకి నంద్యాల ఎంపీ స్థానం ఇస్తారని టాక్‌ నడుస్తోంది. అయితే నంద్యాల ఎంపీ స్థానంపై అలీ ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ఆయన ముస్లింలు ఎక్కువగా గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వాలని కోరుతున్నారని చెబుతున్నారు. లేదా తన సొంత ఊరైన రాజమండ్రి ఎంపీ సీటును ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే రాజమండ్రి ఎంపీ సీటును జగన్‌ కాపు సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాపులు కాకుంటే గౌడ కులానికి చెందిన అభ్యర్థికి ఎంపీ స్థానం ఇస్తారని సమాచారం.

ఇక గుంటూరు ఎంపీ స్థానాన్ని కమ్మ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని జగన్‌ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా పోటీ చేయిస్తారని టాక్‌. ఈయన కమ్మ సామాజికవర్గానికి చెందినవారే.

ఈ నేపథ్యంలో అలీ కోరుతున్న గుంటూరు, రాజమండ్రి స్థానాలు రెండూ ఆయనకు కేటాయించే అవకాశం లేదని అంటున్నారు. ఇక నంద్యాలను అలీ వద్దంటున్న నేపథ్యంలో నంద్యాల ఎంపీ స్థానంలో వక్ఫ్‌ బోర్డు మాజీ చైర్మన్, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఖాదర్‌ భాషాను బరిలోకి దింపుతారని చెబుతున్నారు.