Begin typing your search above and press return to search.

బెయిల్ పై జగన్... సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

అనంతరం బీజేపీ బారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు తాము పోరాటం చేస్తామని చెప్పుకున్న నారాయణ

By:  Tupaki Desk   |   28 Aug 2023 6:16 AM GMT
బెయిల్ పై జగన్... సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యునిస్టులు ఉన్నారా అంటే... తెలంగాణలో కాస్త మునుగోడు తర్వాత కాస్త మనుగడలోకి వచ్చినప్పటికీ... ఏపీలో మాత్రం ఆ సూచనలు కనిపించడం లేదనే అంటారు పరిశీలకులు. దీంతో కమ్యునిస్టు పార్టీ సీపీఐ.. బస్సు యాత్ర స్టార్ట్ చేసింది.

దీనివల్ల వారి లక్ష్యం ఏమిటి అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా అటు కేంద్ర ప్రభుత్వంపైనా, ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలపైనా సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ, తెలంగాణలో బీఆరెస్స్ ముసుగులో బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమే కొనసాగుతోందని సీపీఐ నారాయణ విమర్శించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను అలానే పరిగణించాలనుకున్నారో ఏమో కానీ... తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అనంతరం బీజేపీ బారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు తాము పోరాటం చేస్తామని చెప్పుకున్న నారాయణ... దేశాన్ని దుర్మార్గుడైన మోడీ పాలిస్తున్నారని మండిపడ్డారు. అందుకే... దేశంలో మోడీని గద్దె దించేందుకు 26 పార్టీలతో రాజకీయ వేదిక ఏర్పడిందని అన్నారు.

ఈ క్రమంలో... ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 1న ముంబై వేదికగా సమావేశం మోడీని వ్యతిరేకంగా కీలక సమావేశం జరగబోతోందని నారాయణ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు పోరాటం చేస్తామని తెలిపారు. మోడీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు.

అనంతరం అటు కేసీఆర్, ఇటు జగన్ లు మోడీకి మిత్రపక్షంగా మారిపోయారన్ని చెప్పిన ఆయన... కవిత కోసమే కేసీఆర్ మోడీముందు తలొంచారని తెలిపారు. ఇదే సమయంలో కేసులకు భయపడే జగన్ మారిపోయారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్‌ పై బయట ఉండలేదని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మరోవైపు, జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా స్పందించారు. వివేకా హత్య జరిగి నాలుగేళ్లయినా ఆ కేసు ఓ కొలిక్కి రాలేదని విమర్శించారు. పులివెందులకు చిన్న పిల్లాడికి కూడా వివేకాను హత్య చేసింది ఎవరో తెలుసని.. సీబీఐ మాత్రం విచారణ కొనసాగించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీల పొత్తు ఉంటే జగన్ నెత్తిమీద చంద్రబాబు పాలు పోసినట్లేనని ఫ్యూచర్ చెప్పారు సీపీఐ రామకృష్ణ!