Begin typing your search above and press return to search.

జగన్ హామీల వర్షం...తడిసి ముద్ద అవ్వాల్సిందే...!

ఆ మీదట జగన్ హెలికాప్టర్ ద్వారా రోజుకు మూడు నాలుగు సభలతో ఏపీ అంతా కలియ తిరగనున్నారు

By:  Tupaki Desk   |   19 April 2024 3:55 AM GMT
జగన్ హామీల వర్షం...తడిసి ముద్ద అవ్వాల్సిందే...!
X

ఏపీలో అసలైన ఘట్టానికి రాజకీయ పార్టీలు చేరువ అవుతున్నాయి. ఈ నెల 24తో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన మేమంతా బస్సు యాత్ర ప్రచార కార్యక్రమానికి టెక్కలి వద్ద ముగింపు సభతో గుమ్మడి కాయ కొట్టనున్నారు. దాంతో సిద్ధం సభలకు ఫుల్ స్టాప్ పెడతారు. ఆ మీదట జగన్ హెలికాప్టర్ ద్వారా రోజుకు మూడు నాలుగు సభలతో ఏపీ అంతా కలియ తిరగనున్నారు.

ఈ మధ్యలోనే ఆయన పులివెందుల ఈ నెల 25న వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన నామినేషన్ పత్రాలను స్వయంగా దాఖలు చేయనున్నారు. ఇక అక్కడ జరిగే భారీ సభలో జగన్ ప్రసంగించడం ద్వారా హెలికాప్టర్ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఇదిలా ఉంటే ఈ ప్రచారానికి ముందే వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోని జగన్ రిలీజ్ చేయనున్నారు అని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల ప్రణాళికలో ఏఏ హామీలు ఉంటాయి అన్నదే బిగ్ డిబేట్ గా ఉంది. పార్టీ వర్గాలు కూడా దీని మీద చర్చించుకుంటున్నాయి. అయితే జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పధకంలోనూ భారీ పెంపు ఉంటుందని అంటున్నారు.

ఉదాహరణకు అమ్మ ఒడి పధకం కింద పదిహేను వేల రూపాయలు ఏటా ఇస్తున్నారు. దానిని ఇరవై వేలకు పెంచుతారు అని అంటున్నారు. అలాగే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ఇచ్చే 13,500 మొత్తాన్ని కూడా ఇరవై వేలకు పెంచుతారు అని అంటున్నారు. ఈ రైతు భరోసాలో కేంద్రం ఇచ్చేది ఆరు వేల రూపాయలు ఉంది. అంటే ఏపీ సర్కార్ ఇక మీదట 14 వేల రూపాయలు పెంచుతుంది అన్న మాట.

అదే విధంగా విద్యార్ధులకు చెల్లించే వసతి దీవెన విద్యా దీవెన నిధులను కూడా భారీగా పెంచాలని యోచిస్తున్నారుట. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైన అంశం సామాజిక పెన్షన్ మొత్తాన్ని అయిదు వేలకు పెంచడం. ఇది కీలకమైన హామీగా వైసీపీ మ్యానిఫేస్టోలో ఉండబోతోంది అని అంటున్నారు. ప్రస్తుతం మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దాన్ని రానున్న అయిదేళ్లలో ఏడాదికి నాలుగు వందల వంతున పెంచుకుంటూ చివరి ఏడాదికి అంటే 2029 ఎన్నికల నాటికి అయిదు వేలు చేస్తామని భారీ హామీని వైసీపీ పొందుపరుస్తుంది అని అంటున్నారు.

ఇదే కాదు ఇంకో బ్రహ్మాస్తం లాంటి హామీ ఉందని అంటున్నారు. అదే రైతు రుణ మాఫీ. దానికి ఏకంగా లక్షన్నర రూపాయలు వంతున ప్రతీ రైతుకూ రుణాన్ని మాఫీ చేయాలని జగన్ ఎన్నికల ప్రణాళికలో ఉంచబోతున్నారు అని అంటున్నారు. ఇది అద్భుతంగా జనంలోకి వెళ్ళి మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకుని వస్తుందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు.

ఇక వీటితో పాటుగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వివిధ వర్గాలతో జగన్ సమావేశం అయినప్పుడు వారు చెప్పిన సమస్యల నుంచి కూడా కొన్ని తీసుకుని కీలక హామీలను ఇవ్వాలని చూస్తున్నారుట. మొత్తంగా చూస్తే వైసీపీ ఎన్నికల ప్రణాళిక ఈసారి ఏ ఒక్క వర్గాన్ని నిరాశ పరచకుండా ఈ మండు వేసవిలో వరాల వర్షాన్ని కురిపిస్తుందని అంటున్నారు.

గత ఐదేళ్లలో వైసీపీ ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశారు కాబట్టి ఈసారి ఇచ్చే హామీల పట్ల ప్రజలు పూర్తిగా సానుకూలంగా ఉంటారని, వైసీపీకి తిరుగులేని విజయాన్ని అందిస్తారు అని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. సో అంతా ఇపుడు వైసీపీ ఎన్నికల ప్రణాళిక కోసం వెయిటింగ్ అన్న మాట.