Begin typing your search above and press return to search.

జగన్ సర్కారును టెన్షన్ పెట్టే ప్రకటన వచ్చేసింది

మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 9:51 AM IST
జగన్ సర్కారును టెన్షన్ పెట్టే ప్రకటన వచ్చేసింది
X

ఏపీలోని జగన్ సర్కారుకు కొత్త టెన్షన్ తీసుకొచ్చే ప్రకటన ఒకటి విడుదలైంది. జగన్ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయ.. ఉద్యోగ సంఘాలు చేపట్టిన మహా ధర్నా సందర్భంగా చోటు చేసుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వారంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది లేదు. దీనిపై మరోసారి గళం విప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

ఎన్నికలు మరో తొమ్మిది నెలలకు తగ్గిపోయిన వేళ.. చివరి మూడు నెలలు పాలనా పరమైన అంశాలకు సంబంధించి మాత్రమే ఫోకస్ ఉండటంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్ని నమ్మి ఆయన వెంట నడిచామని.. నాలుగున్నరేళ్లు గడిచినా ఇచ్చిన హామీని నెరవేర్చని వైనంపై ఉద్యోగ సంఘాలు కినుకుతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన చలో విజయవాడకు పిలుపునిస్తూ ప్రకటన విడుదల చేశారు.

సీపీఎస్ ఉద్యోగులపై గతంలో పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారని.. అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదన్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు.. ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చని నేపథ్యంలో తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

సీపీఎస్ రద్దు.. జీపీఎస్ వద్దు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ముద్దు అంటూ.. వైనాట్ ఓపీఎస్ అంటూ నినదించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ చలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా వేలాది మంది ఉద్యోగులు.. వినూత్న మార్గాల్లో విజయవాడకు చేరుకొని రోడ్ల మీద పోటెత్తటం.. తమ నిరసన గళాన్ని బలంగా వినిపించటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన చేపట్టిన చలో విజయవాడ ప్రభుత్వానికి కొత్త టెన్షన్ తో పాటు.. సవాలుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ సర్కారు దీనికి విరుగుడు చర్యలు ఏం చేపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.