''లోకేష్ అసలు మనిషేనా?'' - మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు, స్టీల్ ప్లాంట్ బాధితులకు ఓదార్పు
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 10 Jun 2026 2:58 PM ISTవైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అమానవీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా మంత్రి లోకేశ్ పై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదనంగా రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు.
ఇంత అమానవీయమా?
స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత బాధాకరమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రమాదంలో 9 మంది చనిపోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరు 95 శాతం కాలిన గాయాలతో అత్యంత విషమ పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు జగన్ రెడ్డి చెప్పారు. ‘ఈ ప్రమాదానికి ఉద్యోగులు ఎంతమాత్రం కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగింది. ఇలాంటి విపత్కర సమయంలో బాధితుల పట్ల మానవత్వం చూపించాల్సింది పోయి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది’ అని మాజీ సీఎం విమర్శించారు.
నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నిన్న లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేష్ లాంటి మనుషులు కూడా సమాజంలో ఉంటారా? అనిపించింది. ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి పరిహారం అందిస్తారో చెప్పకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయకుంటే.. రేపు మేం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఆదుకుంటాం’ అని భరోసా ఇచ్చారు. బాధితులకు రూ.1.72 కోట్లు పరిహారంగా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అది కార్మికులకు నిబంధనల ప్రకారం అందే మొత్తమేనని జగన్ రెడ్డి తెలిపారు. ఇందులో మీరు ఇచ్చేది కొత్తగా ఏముంది బోడి అంటూ ధ్వజమెత్తారు. చట్టబద్ధంగా వచ్చే డబ్బుతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేరకు రూ.కోటి చొప్పున చెల్లిస్తామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
తమ ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఎలా అండగా ఉన్నామో, ప్రస్తుత కూటమి హయాంలో వారి పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ప్రజలు గమనించాలని జగన్ కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి స్టీల్‌ప్లాంట్‌లో 28 వేల మంది ఉద్యోగులు ఉంటే, ఈ కూటమి వచ్చిన రెండేళ్లలోనే 10,500 మంది రెగ్యులర్ ఉద్యోగులను, 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని మండిపడ్డారు. వీఆర్‌ఎస్ పేరుతో మరో 1,800 మందిపై ఒత్తిడి తెచ్చి, మొత్తంగా ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా గత నాలుగు నెలలుగా ఉద్యోగులకు జీతాలు బకాయి పెట్టారని, జీతాలకు ప్రొడక్షన్‌తో లింకు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
తమ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్ విద్యుత్‌కు కేవలం 50 పైసలే చార్జ్ చేసేవాళ్లమని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏకంగా రూ.8.50 పైసలకు పెంచి కార్మికులు క్వార్టర్లను వదిలిపోయేలా చేశారని మండిపడ్డారు. బోనస్, మెడికల్ సదుపాయాలను పూర్తిగా నిలిపివేశారని విమర్శించారు. కూటమి పెద్దలు చెబుతున్న ప్యాకేజీలు ప్లాంట్ మెయింటెనెన్స్ కోసం కాదు, కార్మికులను బలవంతంగా బయటకు పంపడానికేనని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తొలి నుంచి అడ్డుకుంది వైఎస్సార్‌సీపీనేనని జగన్ గుర్తు చేశారు. ప్రైవేటీకరణ వద్దంటూ 2021 ఫిబ్రవరి 6, మార్చి 9వ తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తానే లేఖలు రాశానని, అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశామని నాటి లేఖలను చదివి వినిపించారు.
14 నెలల క్రితం స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో పెంటయ్య అనే కార్మికుడు మరణిస్తే, నెల రోజుల్లోనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూటమి నాయకులు మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. నేటికీ వారికి పరిహారం కానీ, ఉద్యోగం కానీ ఇవ్వలేదని.. అధికారులను అడిగితే ‘ఫైల్ పోయింది’ అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా తప్పుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
