Begin typing your search above and press return to search.

టైం లేదు వైఎస్ అవినాష్.. అక్కలకు గట్టి జవాబివ్వాల్సిందే!

కాగా, ఇప్పుడు ఇద్దరు అక్కలు షర్మిల, సునీతా నేరుగా దాడి చేస్తున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా నోరు విప్పాల్సిన అవసరం ఉంది.

By:  Tupaki Desk   |   6 April 2024 10:30 AM GMT
టైం లేదు వైఎస్ అవినాష్.. అక్కలకు గట్టి జవాబివ్వాల్సిందే!
X

తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ ఏదంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యనే. 2019 మార్చి 15న ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనేది? ఇంతవరకు తేలలేదు. గత ఎన్నికల సందర్భంగా తీవ్ర చర్చనీయాంశం అయిన వివేకా హత్య ఈ ఎన్నికలకు వచ్చేసరికి "వివేకం" పేరిట సినిమాగానూ రావడం గమనార్హం. ఇక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా అయిన వైఎస్ వివేకా.. సాక్షాత్తు ఓ మాజీ సీఎంకు స్వయానా తమ్ముడు. అలాంటి నాయకుడిని ఆయన సొంత ఇంట్లో అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ ఐదేళ్లుగా వివేకా హత్య అనేక మలుపులు తిరిగింది.

అప్పుడు అన్నవెంట.. ఇప్పుడు తమ్ముడిపై ఆరోపణలు వివేకా హత్య జరిగిన రోజు సాయంత్రం అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పక్కన నిల్చున్నారు చెల్లెళ్లు వైఎస్ షర్మిల, వివేకా కూతురు సునీతారెడ్డి. ఆ సమావేశంలో వీరి వెనుక ఉన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కాగా, తదనంతరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం జగన్ సీఎం కావడం అందరికీ తెలిసిందే.

తేల్చాస్తారనుకుంటే నాన్చారు జగన్ సీఎం అయ్యాక.. వైఎస్ వివేకా హత్య కేసు నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ దర్యాప్తునకు వెళ్లింది. ఇక అంతకు కాస్త ముందు నుంచే సునీతారెడ్డి భిన్న స్వరం వినిపించసాగారు. మరోవైపు సీబీఐ చేతికి వెళ్లి దాదాపు నాలుగేళ్లు అవుతున్నా.. ఇంతకూ కేసు తేలలేదు. ఈ మధ్యలోనే వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై వివేకా హత్య విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల ముందు డైరెక్ట్ ఎటాక్ వివేకా హత్య విషయంలో సరిగ్గా ఎన్నికల సమయం వచ్చేసరికి తన అక్కలు వైఎస్ షర్మిల, సునీతారెడ్డిలకు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన టార్గెట్ అయ్యారు. షర్మిల, సునీతా ఇద్దరూ డైరెక్ట్ గానే అవినాష్ పేరు ప్రస్తావిస్తున్నారు. రోజురోజుకు వీరి ఆరోపణల తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు.

మరి అవినాష్ నోరిప్పేదెప్పుడు...? వివేకా హత్యపై నేరుగా అసెంబ్లీలోనే సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. అవినాష్ ఇలాంటి పని చేయడని తేల్చిచెప్పారు. మొన్న ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనూ జగన్ ఇదే సంగతిని అన్యాపదేశంగా చెప్పారు. కాగా, ఇప్పుడు ఇద్దరు అక్కలు షర్మిల, సునీతా నేరుగా దాడి చేస్తున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. తనవంతుగా గట్టిగా ఖండించాల్సిన సందర్భం వచ్చేసింది.

స్పందించకుంటే గట్టి దెబ్బనే..అవినాష్ రెడ్డి గనుక అక్కల ఆరోపణలపై దీటుగా సమాధానం ఇవ్వకుంటే ఎన్నికల్లో ఆయనకు గట్టి దెబ్బ పడుతుంది. అందులోనూ ఆయనకు పోటీగా కడప నుంచి వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు. ఎన్నికల సమరం ముదిరేకొద్దీ అవినాష్ పై ఆరోపణల తీవ్రత పెరుగుతూ పోతే అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి అవినాష్ ఎప్పుడు నోరు విప్పుతారో చూడాలి..