Begin typing your search above and press return to search.

వివేకా కేసులో మరో బిగ్ ట్విస్టు.. పులివెందుల డీఎస్పీ వద్దకు సునీత

వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై తప్పుడు కేసుకు కారణమైన రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Nov 2025 1:38 PM IST
వివేకా కేసులో మరో బిగ్ ట్విస్టు.. పులివెందుల డీఎస్పీ వద్దకు సునీత
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై తప్పుడు కేసుకు కారణమైన రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిపై లింగాల మండలానికి చెందిన కుళాయప్ప ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కుళాయప్పపై రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి ఇటీవల దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల వచ్చిన సునీత డీఎస్పీ మురళీనాయక్ ను కలిశారు.

కుళాయప్పపై దాడి చేసిన రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తండ్రిని హత్య చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుళాయప్పపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని సునీత డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు తాత్సార్యం చేస్తే వారు మరికొందరిని బెదిరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

వివేకా కుమార్తె పులివెందుల రాక స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం నుంచి ఆమె ఊహించని మద్దతు లభిస్తోందని అంటున్నారు. దీంతో తన తండ్రిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలకు ఆమె ఒకవైపు సీబీఐపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర పోలీసులతోనూ నిందితులపై చర్యలు తీసుకునే దిశగా ఆమె పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో కడప జిల్లాకు చెందిన కూటమి పార్టీల నేతల నుంచి సునీతకు సంపూర్ణ సహకారం లభిస్తోందని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే గతంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి తనపై చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయించుకున్న సునీత.. ఇప్పుడు రివర్స్ అటాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించిన వారిని క్షమించకూడదని భావిస్తున్న సునీత కూటమి ప్రభుత్వ పెద్దలను కలిసి.. వివేకా హత్యకు కారణమైన వారు, సహకరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతోనే సునీతపై తప్పుడు కేసు పెట్టిన రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వరరెడ్డి, ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో ఫిర్యాదుదారుపై వారు దౌర్జన్యం చేశారనే మరో కేసు రెడీ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా వివేకా కేసులో అనుమానితులు అందరికీ ఇబ్బందుల తప్పవని చెబుతున్నారు.