Begin typing your search above and press return to search.

ఊగిస‌లాట‌లో వివేకా కేసు.. ఎప్ప‌టికి తేలుతుంది ..!

ఇదేస‌మ‌యంలో సునీత‌కు వేరే వేరే ఇంట్ర‌స్టులు ఉన్నాయంటూ.. సీబీఐ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో పేర్కొన‌డం ప‌ల్ల తెలంగాణ హైకోర్టు కూడా.. ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసింది.

By:  Garuda Media   |   25 Nov 2025 1:00 AM IST
ఊగిస‌లాట‌లో వివేకా కేసు.. ఎప్ప‌టికి తేలుతుంది ..!
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత చిన్నాన్న‌, దారుణ హ‌త్య‌కు గురైన వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసు ఎప్ప‌టికి తేలుతుంది? అంటే.. చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే ఈ కేసును విచారించ‌డం పూర్త‌యింద‌ని సీబీఐ అధికారులు తెలంగాణ హైకోర్టులో త‌మ విచార‌ణ‌కు సంబంధించిన పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఇక‌, విచారించాల్సింది ఏమైనా ఉందా? అని అన్న‌ప్పుడు కూడా ఏమీ లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో కీల‌క వ్య‌క్తులు కూడా దీనివెనుక ఉన్నార‌ని పేర్కొన్నారు.

కానీ, ఇక్క‌డే కేసు యూట‌ర్న్ తీసుకుంది. దీనిపై మ‌రింత లోతుగా విచారించాల‌ని.. త‌మ అనుమానాల ను సీబీఐ అధికారులు ప‌ట్టించుకోలేద‌ని చెబుతూ... వివేకా కుమార్తె సునీత పిటిష‌న్ వేశారు. దీనిలో ఆమె అనేక సందేహాలు.. వ్య‌క్తం చేశారు. కీల‌క నాయ‌కుల‌ను, రాజ‌కీయ ప‌ర‌మైన వ్య‌క్తుల‌ను సీబీఐ ఉదాసీనంగా వ‌దిలేసింద‌న్న‌ది సునీత ఆరోప‌ణ‌. ప్ర‌స్తుతం ఈ కేసుపైనే విచార‌ణ జ‌రుగుతోంది. కానీ, వాస్త‌వానికి తాము ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌లేద‌ని సీబీఐ అధికారులు చెబుతున్నారు.

ఇదేస‌మ‌యంలో సునీత‌కు వేరే వేరే ఇంట్ర‌స్టులు ఉన్నాయంటూ.. సీబీఐ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో పేర్కొన‌డం ప‌ల్ల తెలంగాణ హైకోర్టు కూడా.. ప‌లు సందేహాలు వ్య‌క్తం చేసింది. దీనిని రాజ‌కీయం చేయాల ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించింది. అయిన‌ప్ప‌టికీ.. సునీత వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీనిపై విచార‌ణ చేయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రోవైపు.. కేసును త్వ‌ర‌గా పూర్తిచేసేలా ఆదేశించాల‌ని కోరుతూ.. సునీతే మ‌రో పిటిష‌న్ వేశారు. దీనిపైనా విచార‌ణ సాగుతోంది.

అయితే.. ఈ ప‌రిణామాల‌తో కేసును పూర్తిగా విచారించాల‌ని ఒక‌టి, పూర్తి చేయాల‌ని మ‌రొక‌టి దాఖ‌లు దాఖ‌లు చేయ‌డం ప‌ట్ల కోర్టు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేస్తోంది. ఇలా ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నించింది. దీంతో అస‌లు వివేకా కేసు ఇప్ప‌ట్లో తేలుతుందా? అనేది బిగ్ క్వ‌శ్చ‌న్‌గా మారిపోయింది. మ‌రోవైపు.. స‌ర్కారు నుంచి సంపూర్ణ స‌హ‌కారం అందుతోంది. ఇటీవ‌ల సీఐ శంక‌ర‌య్య‌పై ప్ర‌భుత్వం వేటు వేసింది.

అదేవిధంగా జైల్లో త‌న‌ను బెదిరించారంటూ.. ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని నియ‌మించింది. అయినా.. మ‌రిన్ని విష‌యాల‌పై విచార‌ణ చేయాల‌ని సునీత కోరుతున్నారు. దీంతో ఈ కేసు ఎప్ప‌టికి తేలుతుంది? అనేది ప్ర‌శ్న‌.