Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసులో మరో కీలక అడుగు.. సుప్రీంకోర్టు ముందుకు సోలిసిటర్ జనరల్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా తేలడం లేదు.

By:  Tupaki Desk   |   16 Sept 2025 4:12 PM IST
వివేకా హత్య కేసులో మరో కీలక అడుగు.. సుప్రీంకోర్టు ముందుకు సోలిసిటర్ జనరల్..
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా తేలడం లేదు. ఎన్నో అనుమానాలు కేసు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నిజమైన న్యాయం ఇంకా జరగనేలేదు. ఈ కేసు మొదటి నుంచి వివాదాస్పదంగానే కొనసాగుతోంది. స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినా.. అందులో విశ్వసనీయత లేదని వివేకా కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును సీబీఐకి బదిలీ చేసింది.

స్పష్టంగా వెలుగులోకి రాని..

దర్యాప్తు చేపట్టిన సీబీఐ కొందరు కీలక నేతలను అరెస్ట్ చేసింది. ఆయా పార్టీలు అవి పెడుతున్న ఒత్తిడి కారణంగా దర్యాప్తు కొంత క్లిష్టంగా మారాయి. హత్య వెనుక ఉన్న వ్యక్తుల ఉద్దేశాలు, కుట్రలు ఇప్పటికీ స్పష్టంగా వెలుగులోకి రాలేదు. విచారణలో వెలువడిన ప్రతి కొత్త సమాచారం, రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతూనే వచ్చింది.

మరింత లోతుగా దర్యాప్తు జరగాలి..

ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని మరింత లోతుగా దర్యాప్తు కావాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును మరోసారి దర్యాప్తు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఈసారి కేసు కీలక మలుపులు తిరుగుతుందని సంకేతాలు వస్తున్నాయి. పిటిషనర్ తరఫున కూడా ‘దర్యాప్తు లోతుగా సాగాలి’ అనే అభ్యర్థన రావడంతో, సీబీఐ కూడా ఇదే దిశలో అడుగులు వేసేందుకు సిద్ధమైందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈ అంశాన్ని కోర్టులో స్పష్టంగా ఉటంకించారు. ధర్మాసన ఆదేశాల కోసం సీబీఐ ఎదురు చూస్తోంది.

అనుమానాలకు నివృత్తి ఎప్పుడు..

ఈ పరిణామం న్యాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఊరటనిచ్చినప్పటికీ, మరోవైపు ప్రజల్లో ఉన్న అనుమానాలను కూడా బయటకు తీసుకువస్తుంది. ‘ఇంత కాలం అయినా నిజం ఎందుకు బయటకు రావడంలేదు..?’, ‘రాజకీయ ఒత్తిళ్లు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నాయా..?’ అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థకు ఉన్న విశ్వాసమే ఈ కేసులో వాస్తవం వెలుగులోకి తెచ్చే ప్రధాన ఆధారం.

సవాల్ గా మారిన కేసు

వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్ కే ఒక సవాల్ గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కుటుంబ సభ్యుడు ఇంత దారుణంగా హత్యకు గురవడం, ఇంత కాలమైనా తుది ఫలితం రాకపోవడం ప్రజల్లో నిరాశను కలిగిస్తోంది. అయితే, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే, నిజానికి దగ్గర వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సీబీఐ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఎవరో.. హత్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో అనేది నిర్ధారితమైతేనే ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ గౌరవం నిలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఒకవైపు.. న్యాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు మరోవైపు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకం కానున్నాయి. తీర్పు ఆలస్యమైనా చివరికి న్యాయం దక్కాలని వివేకా కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు.