Begin typing your search above and press return to search.

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులతో ప్రాణహాని.. వివేకా హత్య కేసు నిందితుడు ఆందోళన

వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొందరు అనుమానితులు మరణించగా, సాక్ష్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 1:04 PM IST
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులతో ప్రాణహాని.. వివేకా హత్య కేసు నిందితుడు ఆందోళన
X

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు, ఏ2 సునీల్ యాదవ్ సహ నిందితుల నుంచి ప్రాణ హాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. గతంలో ఓ సారి తన ప్రాణాలకు హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సునీల్ యాదవ్ మరోమారు పులివెందుల పోలీసు స్టేషన్ లో రెండో ఫిర్యాదు చేశాడు. ఈ సారి తనకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.

వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొందరు అనుమానితులు మరణించగా, సాక్ష్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏ2 సునీల్ యాదవ్ కూడా తన ప్రాణాలకు ముప్పు ఉందని భయపడుతున్నాడు. ఈ మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం తన పెళ్లి రోజు సందర్భంగా పులివెందుల రింగు రోడ్డులోని ఆలయానికి వెళితే, ఎంపీ అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ తోపాటు మరికొందరు రెండు వాహనాల్లో వెంబడించారని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశాడు.

వివేకా హత్య కేసులో సుమారు మూడేళ్లు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సునీల్ యాదవ్.. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా చెబుతారు. అయితే హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత తన ప్రాణాలకు హాని ఉందంటూ అతడు భయపడుతున్నాడు. గత మార్చిలో సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివేకా హత్యపై నిర్మించిన సినిమాలో తనను, తన తల్లిని కించపరచడాన్ని సునీల్ యాదవ్ వ్యతిరేకించాడు. దీనిపైనా ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తన ప్రాణానికి ఎలాంటి హాని జరిగిన అందుకు వైసీపీ నేతలే కారణమంటూ సునీల్ యాదవ్ గతంలో ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఏకంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తల పేర్లు చెబుతూ ఆయన ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.