సీబీఐపై వైఎస్ సునీత అసంతృప్తి, వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు
తన తండ్రి హత్య కేసుపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
By: Tupaki Political Desk | 15 March 2026 1:52 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై వైఎస్ సునీత్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వివేకా ఏడో వర్ధంతి సందర్బంగా సునీత పులివెందుల వెళ్లారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడుతూ సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యపై ఇప్పటికీ తన అనుమానాలను నివృత్తి చేయలేదని సునీత వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసుపై దర్యాప్తు ముగిసిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో సునీత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
హత్య కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నిందితులు చెప్పిన అంశాలనే చెబుతోందని, వారు చెప్పినట్లు నడుచుకుంటోందని సునీత ఆరోపించారు. సీబీఐ లోతుగా దర్యాప్తు చేయలేదని విమర్శించారు. తన తండ్రి హత్య తర్వాత నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజెస్ పై సీబీఐ దృష్టి పెట్టలేదని సునీత పెదవి విరిచారు. ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండని అడిగితే, తన వద్ద ఉన్న అదనపు ఆధారాలను సైతం కోర్టుతోపాటు సీబీఐకి సమర్పించినట్లు సునీత తెలిపారు. వివేకా హత్యపై తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డిని విచారించాలని సునీత డిమాండ్ చేశారు.
తన తండ్రి హత్య కేసుపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్నానని, అయినా తనకు న్యాయం జరగడం లేదని వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని, తన పోరాటం ఇంతటితో ఆగదని సునీత వెల్లడించారు. చివరి వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మన దేశంలో వ్యవస్థలన్నీ ఇలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు తర్వాత సునీత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వివేకా హత్య సమాచారం మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎలా తెలిసింది? అన్న అంశంపై సునీత స్పష్టత కోరుతున్నారు.
అయితే దర్యాప్తు సంస్థ ఆ అంశాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేశామని, దర్యాప్తు ముగిసినట్లేనని సీబీఐ తేల్చిచెబుతోంది. కానీ, సునీత మాత్రం ఇంకా కొందరు నిందితులను గుర్తించాలని, అసలు సూత్రధారులు తప్పించుకున్నారని అంటున్నారు. దీంతో హత్య కేసు విచారణ కూడా ముందుకు సాగడం లేదు. వివేకా హత్య జరిగి నేటి ఏడేళ్లు పూర్తవుతోంది. 2019 మార్చి 15న మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన హత్య కేసు ఇప్పటికీ అనేక మలుపులు తిరుగుతోంది.
