సునీత అంతరంగం అర్థమవుతోందా? ఆ ప్రశ్నలకు బదులిచ్చేవారు ఎవరు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేవనెత్తున్న ప్రశ్నలు మరోమారు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
By: Tupaki Desk | 11 Aug 2025 6:59 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేవనెత్తున్న ప్రశ్నలు మరోమారు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తండ్రిని కోల్పోయి ఆరేళ్లుగా పోరాటం చేస్తున్న తనకు న్యాయం చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారనే అంశం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి స్వయాన చిన్నాన్న కుమార్తె అయిన సునీత గత ఐదేళ్లు న్యాయం కోసం అలుపు ఎరుగని పోరాటం చేశారు. స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తన తండ్రి వివేకా కేసులో నిందితులకు వ్యతిరేకంగా సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. అయితే వివేకా కేసులో విచారణ పూర్తయిందని, కోర్టు మళ్లీ ఆదేశిస్తే తిరిగి విచారణ ప్రారంభిస్తామని దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానంలో అఫిటవిట్ వేసింది. దీంతో దోషులను శిక్షించకుండానే దర్యాప్తు ముగిసిందని చెప్పడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్న వైఎస్ సునీత.. తన తండ్రిని హతమార్చిన వారిని శిక్షించాలని ప్రజలను కోరుతుండటం రాజకీయ ప్రాధాన్యంశంగా మారిందని అంటున్నారు.
ఆరేళ్ల క్రితం తన నివాసంలోనే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన మరణానికి తొలుతు గుండెపోటుగా ప్రచారం చేసినా ఆ తర్వాత గొడ్డలిపోటుగా గుర్తించి హత్య కేసు నమోదు చేశారు. ముందు స్థానిక పోలీసులు విచారణ జరిపిన వివేకా హత్య కేసు హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి బదిలీ అయింది. దీంతో దర్యాప్తు జరిపిన సీబీఐ పలువురు నిందితులను అరెస్టు చేసింది. వీరిలో కొందరికి బెయిలు కూడా మంజూరైంది. అయితే హత్యకు ప్రధాన సూత్రధారిగా సునీత అనుమానిస్తున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడంపై ఆమె తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. అవినాశ్ బెయిలు రద్దు కోసం ఎంత ప్రయత్నించినా కుదురడం లేదు. మరోవైపు అవినాశ్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు సఫలం అవ్వడం లేదు.
ఈ పరిస్థితుల్లో మరోమారు వివేకా హత్య కేసును తెరపైకి తీసుకువచ్చి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయన పార్టీ వైసీపీకి నష్టం చేయాలని సునీత ప్రయత్నాలు ఆరంభించారని అంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ సొంత ఊరు వచ్చిన వైఎస్ సునీత తన తండ్రి హత్యతోపాటు అనేక అంశాలపై స్పందిస్తూ వైసీపీని ఇరుకునపెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తన తండ్రిని సొంత వారే చంపారని తెలుసుకుని షాక్ కు గురైనట్లు చెప్పిన సునీత, తమ ముందు ఆడుకున్న చిన్న పిల్లాడు అవినాశ్ రెడ్డి తన తండ్రిని చంపిస్తాడని కలలో కూడా ఊహించలేదని రెండు రోజుల క్రితం సునీత వ్యాఖ్యానించారు. అంటే పులివెందుల ఎన్నికల నేపథ్యంలో అవినాశ్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే ఆమె ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూటమి నేతలు బీటెక్ రవి, ప్రస్తుతం వైసీపీలో ఉన్న సతీశ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన తండ్రిని చంపారని లేఖ రాయాల్సిందిగా అవినాశ్ రెడ్డి చెప్పారని, దానికి తాను తిరస్కరించానని సునీత వెల్లడించారు.
ఇదంతా పరిశీలిస్తే, వివేకా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, రాజకీయంగా వారి ఉనికి లేకుండా చేయాలని సునీత భావిస్తున్నారు. ఇందుకోసం కూటమి పెద్దల అండదండలు ఆశిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రంలోనూ పరపతి ఉండటంతో తన తండ్రి హత్య కేసును పునర్విచారణ జరిపేలా దర్యాప్తు సంస్థను ఆదేశిస్తారని సునీత ఆశిస్తున్నారు. అయితే ఆమె అంతరంగాన్ని కూటమి నేతలు అర్థం చేసుకున్నారో లేదో కానీ ఇంతవరకు వివేకా హత్య కేసుపై ప్రభుత్వం నుంచి ఆమెకు ఎలాంటి భరోసా దక్కలేదని చెబుతున్నారు.
