షర్మిల షాకింగ్ కామెంట్స్.. బాబాయ్ హత్యకు అసలు కారణం ఇదే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 18 March 2026 5:26 PM ISTమాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ టికెట్ విషయంలోనే వివేకా హత్య జరిగిందని షర్మిల ఆరోపించారు. కడప ఎంపీ పదవికి అవినాశ్ రెడ్డి సరైన వ్యక్తి కాదని బాబాయ్ వివేకానందరెడ్డి తనతో స్వయంగా చెప్పారని షర్మిల వివరించారు. బాబాయ్ ఎంత చెప్పినా, అవినాశ్ కే జగన్ టికెట్ ఇచ్చారన్నారు. బాబాయ్ బతికి ఉంటే తనకు ఎప్పటికైనా అడ్డేనని ఎంపీ అవినాశ్ భావించారని షర్మిల వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా షర్మిల విశాఖ జిల్లాలో పర్యటించారు.
వివేకా హత్యపై పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివేకానందరెడ్డి ఏడో వర్థంతి రెండు రోజుల క్రితమే ముగిసింది. అయినా ఈ హత్య కేసుపై పెద్దగా పురోగతి లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు సంస్థ సరిగా వ్యవహరించలేదని, ఇంకా కొందరి పాత్రపై అనుమానాలను నివృత్తి చేయలేదని వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగించమని ఆమె చేస్తున్న న్యాయపోరాటం విఫలయత్నమే అవుతోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుపై షర్మిల మరోసారి నోరు విప్పడం సంచలనంగా మారింది.
వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె, తన సోదరి వైఎస్ సునీత చేస్తున్న పోరాటానికి తొలి నుంచి షర్మిల మద్దతు చెబుతున్నారు. ఈ విషయమై పలుమార్లు బహిరంగంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ తోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి టార్గెట్ గా షర్మిల తరచూ చేస్తున్న విమర్శలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. వివేకాను హత్య చేసిన వారిని తాను అన్నా అని పిలిచిన వారే కాపాడుతున్నారని గతంలో షర్మిల ఆరోపించారు. పరోక్షంగా మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేశారని అంటున్నారు.
ఇక తాజాగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పేరు ప్రస్తావిస్తూ షర్మిల చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. కడప ఎంపీ టికెట్ కోసమే హత్య జరిగిందంటూ షర్మిల వ్యాఖ్యానించడంతో వైసీపీని మాజీ సీఎం జగన్ ను మరోమారు ఈ వ్యవహారంలోకి షర్మిల లాగారాని చెబుతున్నారు. హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారని, సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని ఆమె గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. తన చిన్నాన్న కుమార్తె సునీతారెడ్డి పోరాటానికి మద్దతుగా ఉంటానని, న్యాయం జరిగే వరకు వదిలిపెట్టబోమని అప్పట్లో స్పష్టం చేశారు. అయితే హత్య కేసు దర్యాప్తును ముగించినట్లు సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత సునీత ఆందోళన వ్యక్తం చేయడం, ఇప్పుడు షర్మిల కూడా ఆమెకు బాసటగా నిలుస్తున్నట్లు మాట్లాడటం రాజకీయ ప్రాధాన్యాంశంగా చెబుతున్నారు. నిందితులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలనే ఆలోచనతో షర్మిల ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
