జగన్, చంద్రబాబు ఒక్కటేనా?.. షర్మిల షాకింగ్ ట్వీట్
కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘తల్లికి వందనం’ అమలుపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
By: Tupaki Political Desk | 17 July 2026 3:56 PM ISTకూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘తల్లికి వందనం’ అమలుపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు పొంతన లేదని ఆమె మండిపడ్డారు. ఈ పథకం అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ ‘తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం’ అంటూ ఘాటు విమర్శలతో ఎక్స్ లో షర్మిల ట్వీట్ చేశారు. గత ప్రభుత్వ మోసాలను తూ.చ. తప్పకుండా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా మోసాలు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సీఎం చంద్రబాబు వారసుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది తల్లికి వందనం పథకంలో భాగంగా 22వ తేదీన నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 42 లక్షల మంది తల్లుల అకౌంట్లలో డబ్బు జమచేసేలా రూ.10 వేల కోట్లు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న మొత్తం 65 లక్షల మంది పిల్లలకు ఈ డబ్బు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం వివరిస్తోంది. అయితే ఇంకా 20 లక్షల మంది అర్హులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వారిని పక్కన పెట్టిందని, చిన్నచిన్న కారణాలతో అనర్హుల జాబితాలో చేర్చి అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తల్లికివందనంపై సవివరమైన విశ్లేషణతో ఆమె చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారని షర్మిల ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మోసపూరిత విధానాలనే కూటమి ప్రభుత్వం కూడా తూ.చ. తప్పకుండా పాటిస్తోందని ఆమె విమర్శించారు. గతంలో 'అమ్మ ఒడి' పేరుతో ఒక్క బిడ్డకే పరిమితం చేసి తల్లులను మోసం చేశారని ఆరోపించిన షర్మిల, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ తల్లులను నయవంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు "కోతల రాయుడు" అని జగన్‌ను ఎద్దేవా చేసిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవే కోతలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని చురకలు అంటించారు.
ఈ సందర్భంగా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు సంధించిన ప్రశ్నలనే షర్మిల తిరిగి ఆయనకు గుర్తుచేశారు. రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే, కేవలం 67 లక్షల మందికి మాత్రమే పథకం వర్తింపజేయడం ఎక్కడి న్యాయమని ఆమె నిలదీశారు. అలాగే 15 వేల రూపాయల ఆర్థిక సాయంలో పాఠశాల అభివృద్ధి పేరుతో 2 వేల రూపాయల కోత విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గత ప్రభుత్వం పెట్టిన అనర్హత నిబంధనలనే కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడంపై షర్మిల మండిపడ్డారు. 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, కారు, ఐదు ఎకరాల భూమి వంటి కారణాలతో లబ్ధిదారులను దూరం చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
"అమ్మ ఒడి అంటూ నాన్న బుడ్డీతో దోపిడీ" అని గతంలో విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ బుడ్డీని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకంపై చిత్తశుద్ధి ఉంటే, యూడైస్ లెక్కల ప్రకారం పెరిగిన వారితో కలిపి మొత్తం 87 లక్షల మంది విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎలాంటి కోతలు లేకుండా ప్రతి బిడ్డకు పూర్తిస్థాయిలో 15 వేల రూపాయలు జమ చేయాలని, అర్హులైన 20 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని దూరం చేసే కొర్రీలను తొలగించాలని ఆమె ప్రభుత్వానికి స్పష్టం చేశారు.
