Begin typing your search above and press return to search.

తల్లి, చెల్లి అనే తేడా లేదా.. జగన్ సైతాన్ సైన్యానికి పచ్చరోగం.. ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

సాక్షి పత్రికలో తనపై వచ్చిన కథనంపై వైఎస్ షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తే తప్పుడు అర్థాలు తీస్తారా అంటూ జగన్‌పై మండిపడ్డారు. మహిళపై ఇలాంటి ఆరోపణలు చేయడం మీ పత్రిక విధానమా? దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

By:  Tupaki Political Desk   |   17 Nov 2026 6:15 PM IST
తల్లి, చెల్లి అనే తేడా లేదా.. జగన్ సైతాన్ సైన్యానికి పచ్చరోగం.. ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
X

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తన బిడ్డ వివాహా ఆహ్వాన పత్రిక అందజేయడానికి షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లడంపై వైఎస్ జగన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో వచ్చిన వార్తపై అభ్యంతరం వ్యక్తం చేసిన షర్మిల తనకు సంజాయిషీ చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి వయసు ఉన్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా? సంబంధాలు అంటగడతారా? వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా? అంటూ షర్మిల నిలదీశారు. సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీసీసీ చీఫ్ షర్మిలరెడ్డి భేటీపై సాక్షి పత్రికలో వచ్చిన కథనం రాజకీయంగా రచ్చకు దారితీసింది. 15వ తేదీన సీఎం చంద్రబాబును కలిసిన షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. అయితే ఈ భేటీపై సాక్షిలో రాసిన కథనం షర్మిల రెడ్డి ఆగ్రహానికి కారణమైందని చెబుతున్నారు. చంద్రబాబుతో షర్మిల చెట్టపట్టాల్ వేసకుని తిరుగున్నారని, వారి మధ్య ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన షర్మిల తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. సాక్షి ప్రచురించిన ఆర్టికల్ ను జత చేస్తూ సాక్షి పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆరోపించారు.

సాక్షి కథనంపై అభ్యంతరం వ్యక్తం చేసిన షర్మిల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై రాసిన కథనం ‘మీ నీచ బుద్దికి, దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట’ అంటూ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆయన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదని మండిపడ్డారు. ‘‘అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.’’ అంటూ షర్మిల పోస్టు పెట్టారు.

ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేనని మండిపడ్డారు. ఎవరి మెప్పుకోసం దిగజారుతున్నారని ప్రశ్నించారు. కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కోణమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీమళ్లీ అర్థమవుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ తండ్రి రాజశేఖరరెడ్డి సైతం ఇంట్లో వివాహాలకు చంద్రబాబును ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన (రాజశేఖరరెడ్డి) కూడా చంద్రబాబుతో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? చంద్రబాబు ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్ఆర్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా? అంటూ ప్రశ్నలు సంధించారు.

వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని తాను ప్రశ్నిస్తున్నానని, అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానమా? అంటూ ధ్వజమెత్తారు. తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండానా అని నిలదీశారు. ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.