జగన్‌కు మీకు తేడా లేదా: చంద్రబాబుకు షర్మిల ప్రశ్న
అయితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని.. జగన్‌కు మీకు తేడా లేదా? అంటూ.. సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.
By: Garuda Media | 17 July 2026 11:08 PM ISTవైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో తల్లులను మాయ చేసి, మోసం చేశారని దుయ్యబట్టారు. ఇంట్లో ఎంత మందికైనా నిధులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఆ తర్వాత.. ఒక్కరికే అమలు చేశారని తెలిపారు. అదేసమయం లో 15000 రూపాయలు ఇస్తామని చెప్పి.. కేవలం 13000లకే పరిమితం అయ్యారని అందుకే తల్లులు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి 11 స్థానాలకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
అయితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందని.. జగన్‌కు మీకు తేడా లేదా? అంటూ.. సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి 15000 చొప్పున ఇస్తామని చెప్పారని, కానీ, ఇప్పుడు కోత పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారని, వారందరికీ 'తల్లికి వందనం' పథకాన్ని అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు 64 నుంచి 67 లక్షల మంది విద్యార్థులకే పరిమితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అలాగే.. గతంలో జగన్ ప్రభుత్వం 'అమ్మ ఒడి' పథకం అమలుకు సవాలక్ష కండిషన్లు పెట్టి తప్పించుకుందని షర్మిల ఆరోపించారు. ఇవే విమర్శలు నాడు చంద్రబాబు సహా కూటమి నాయకులు కూడా చేశారని.. కానీ, అవే నిబంధనలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అమలు చేయడం చిత్రంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. నాలుగు చక్రాల వాహనం ఉంటే తల్లికి వందనం ఇవ్వబోమనడం సరికాదని ఆమె చెప్పారు. అదేవిధంగా కరెంటు యూనిట్లు 300 దాటితే ఇవ్వబోమని చెప్పడం కూడా సరికాదని వ్యాఖ్యానించారు.
తల్లికి వందనం పథకాన్ని సంపూర్ణంగాఅమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పేదల కుటుంబాల్లో సంతోషం నింపుతారని కూటమి ప్రభుత్వంపై ఆశతోనే తల్లులు ఓటేశారని ఆమె తెలిపారు. ఇప్పుడు అవే కుటుంబాల్లో ఆందోళన నింపేలా ప్రభుత్వం నిబంధనలు అమలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని ఆమె తెలిపారు. తక్షణమే నిబంధనలు ఎత్తేసి ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం అమలు చేయాలని కోరారు.
